ఆనందయ్య ‘కరోనా’ మందు: ‘బ్లాక్ మార్కెట్’లో ఎలా దొరుకుతోంది.?

Anandayya Covid 19 Medicine In Black Market?

Anandayya Covid 19 Medicine In Black Market?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. దేనికీ లొంగడంలేదు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ తయారీ సంస్థలే చెబుతున్నాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ‘కరోనా వైరస్ కారణంగా వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వుండబోవు’ అన్నది ప్రముఖంగా వైద్య నిపుణుల నుంచి వినిపిస్తోన్న వాదన. ఆ సంగతి పక్కన పెడితే, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనే గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి తయారు చేస్తోన్న నాటు మందు, కరోనా వైరస్ మీద అత్యద్భుతంగా పనిచేస్తోందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. వేలాదిమంది ఆ గ్రామంపై పడ్డారు.. మందు కోసం. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ప్రభుత్వం ఆనందయ్య నాటుమందు పంపిణీని ఆపేసింది. ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్బే, అది అదుపులోకి తీసుకోవడం కాదు, ఆయనకు రక్షణ కల్పించడమని పోలీసు శాఖ చెబుతోంది. ఆనందయ్య మాత్రం ఎవరికీ అందుబాటులోకి రావడంలేదు.

ఇంకోపక్క ఆనందయ్య తయారు చేసిన మందుపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటి పూర్తి ఫలితాలొచ్చాకనే మందు విక్రయానికి అనుమతించాలా.? వద్దా.? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోపక్క, ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరో వైపు, ఆనందయ్య నాటుమందు పేరుతో.. విచ్చలవిడిగా తెలుగు రాష్ట్రాల్లో నాటుమందు సరఫరా జరుగుతోంది. 5 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ఈ మందు ధర పలుకుతుండడం గమనార్హం. అసలంటూ నాటు మందు తయారీ ప్రస్తుతం లేదని స్వయంగా ఆనందయ్య చెబుతున్నారు. మందు తయారీకి అవసరమైన మూలికలూ సిద్ధంగా లేవన్నది ఆయన వాదన. మరెలా ఆనందయ్య మందు బయటకు వస్తోంది.? విపక్షాల ఆరోపణల ప్రకారం చూస్తే, ఆనందయ్యతో రహస్యంగా అధికార పార్టీ నేతలే మందు తయారు చేసి, అడ్డగోలుగా విక్రయించేస్తున్నారట. ఇది నిజమేనా.? ఏమోగానీ.. ఓ వైపు కరోనా వైరస్.. రాష్ట్రంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంటే, ఇంకో వైపు మందు పేరుతో రాజకీయాలు అంతకన్నా హేయంగా తయారయ్యాయి.