అనిల్ పై కన్నెర్ర చేసిన సీనియర్ నేత.. ఆ జిల్లాల్లో ఇక సమరమే..?

anil kumar yadav

 ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నేత. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి, ఓ దశలో ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం జరిగిన ఆనం రామనారాయణ రెడ్డిని సీఎం జగన్ ఎందుకో దూరం పెడుతూ వచ్చాడు. అదే సమయంలో యువ నేత అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్ ఎక్కువగానే చొరవ చూపిస్తూ వచ్చాడు. దీనితో ఆనంకి వైసీపీ అధిష్టానానికి కొంచం విభేదాలు వచ్చాయి.

anam ramanarayana reddy

 నిజానికి ఆనం కుటుంబానికి అనిల్ కు గత పదేళ్ల నుండి రాజకీయ వైరం నడుస్తుంది. తాజాగా ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆనం, అనిల్ వర్గాల మధ్య గొడవ మొదలైంది. వివేకానందరెడ్డి ఫ్లెక్సీలు తొలిగించారంటూ స్వయానా ఆయన తనయుడు రంగమయూర్ రెడ్డి, అనిల్ వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెట్టింగ్ రాయుళ్ల ఫ్లెక్సీలు వారాల తరబడి కనపడుతున్నాయని, ఆనం వివేకా ఏం పాపం చేశారంటూ పరోక్షంగా మంత్రి అనిల్ ని టార్గెట్ చేశారు. వివేకా పెట్టిన రాజకీయ భిక్షతో పైకెదిగారంటూ అనిల్ పేరు ప్రస్తావించారు కూడా.

 ఇక ఆనం కూడా ఇకపై సిటీ నుండి తన రాజకీయాలు మొదలుపెడుతానని చెప్పటం చూస్తుంటే అనిల్ మీద ఒక రకమైన యుద్ధం ప్రకటించారనే చెప్పాలి. బీడీఎస్ కోర్స్ చేసి డాక్టర్ గా స్థిరపడదామని అనుకుంటున్న టైమ్ లో అనుకోకుండా అనిల్ ని కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా నిలబెట్టి గెలిపించారు ఆనం వివేకానందరెడ్డి. ఆ తర్వాత సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ అసెంబ్లీ బరిలో నిలిచారు. అప్పటికే ఆనం కుటుంబంతో అనిల్ కి కాస్త బెడిసింది. తీరా ఎన్నికల టైమ్ కి అనిల్ వేరు కుంపటి పెట్టుకోవడంతో వివేకా కన్నెర్రజేశారు.

 ఆ ఎన్నికల్లో అనిల్ ఓడిపోవటం వెనుక వివేకా హస్తముందని అనిల్ అనుమానం. అప్పటి నుండి వివాదాలు మరింత ముదిరాయి. ఆ తర్వాత అనిల్ వైసీపీ లో చేరి ఎమ్మెల్యే కావటం, ఆనం కుటుంబం టీడీపీ లో వెళ్లి, మళ్ళి వైసీపీ లోకి రావటం, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత సీనియర్ నేతైనా ఆనంను కాదని అనిల్ కు మంత్రి పదవి ఇవ్వాటం జరిగింది. దీనితో అప్పటి నుండి రగిలిపోతున్న ఆనం రామనారాయణ రెడ్డి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. సిటీకి దూరంగా వెంకటగిరి లో రాజకీయం చేసే ఆనం ఇప్పుడు సిటీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవటం వెనుక అనిల్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యం కనిపిస్తుంది. మరి ఈ పరిణామాలు ఎంత వరకు దారి తీస్తాయో చూడాలి.