రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైరల్ అవుతుంది. తమ పార్టీ నేతల ఫోన్స్ ను, హై కోర్ట్ న్యాయవాదుల ఫోన్స్ ను, జర్నలిస్ట్ ల ఫోన్స్ ను కొంతమంది ట్యాప్ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ విషయంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
ఆధారాలు లేని విషయంపై లేఖ రాయడం చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని నానా మాటలు అన్న చంద్రబాబు ఇవాళ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం అంటూ విమర్శించారు. భార్యను పాలించలేని వాడు దేశాన్ని ఎలా పాలిస్తాడాని గతంలో ప్రధాని మోడీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తు చేశారు. దేశాన్ని పాలించలేని నాయకుడికి నేడు బాబు ఎందుకు లేఖ రాశాడని టీడీపీ నేతలకు ప్రశ్నలు సందించారు.
కేవలం వైసీపీపై ప్రజల్లో చెడ్డ పెరు తీసుకురావడానికే చంద్రబాబు ఈ చీప్ రాజకీయాలకు తెరలేపారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహ శక్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తారని అన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారని, మరి సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని అన్నది చంద్రబాబు కాదా? అని అంబటి ప్రశ్నించారు. టీడీపీ చేసే చీప్ రాజకీయాలకు తాము భయపడమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తమను నేరుగా ఎదుర్కోవాలని, ఇలా తప్పుడు ఆరోపణలతో కాదని సవాల్ విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు చరిత్ర గురించి టీడీపీ నాయకుల కంటే కూడా అంబటికే బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.