తేదాపా ఎంపీలు గురువారం రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. మీడియాకి ఎలాంటి సమాచారం గానీ, ఎలాంటి హడావుడిగానీ లేకుండా టీడీపీ ఎంపీలంతా రాష్ర్టపతిని కలిసారు. ఏపీలో జగన్ మూడు రాజధానులు సహా పలు కార్యక్రమాల్నీ స్పీడప్ చేయడంతో ఫిర్యాదులు చేయడానికి వెళ్లినట్లు ఆ తర్వాత మీడియాలో హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి క్రితమే వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ సమావేశానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎంపీలంతా కట్టకట్టుకుని ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కలిపి చెప్పడానికి వెళ్లారన్నారు. 52 పేజీల పెద్ద లేఖ కూడా రాష్ర్టపతికి ఇచ్చారు. అందులో అన్నీ అబద్దాలే. ఏడాది పాలనపై తప్పుడు రాతలు రాసి ఆయనకి ఇచ్చారన్నారు.
జగన్ ప్రభుత్వం ఏడాదిగా అవినీతి పాలన అందిస్తుందని ఇలాంటి అంశాల్నే లేఖలో ప్రస్తావించి ఉంటారని సందేహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఎలాంటి రాజకీయాలు చేస్తారో? నాలుగు దశాబ్ధాలుగా ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. టీడీపీ నేతలపై అరెస్ట్ లు ప్రభుత్వం చేయించిందంటున్నారు. వాళ్లని ఊరికే ఏసీబీ అధికారులు అరెస్ట్ లు చేయలేదు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే జైలు కెళ్లారన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రభాకర్ రెడ్డిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసారా? అని ప్రశ్నించారు. వీళ్లందర్నీ విచారిస్తే కీలక నేతలంతా బయటకు వస్తారు. ఆ భయంతోనే కక్ష సాంధిపు పేరుతో రాష్ర్టపతికి లేఖ ఇచ్చారన్నారు.
సీబీఐ రాష్ర్టానికి రావడానికి వీలు లేదని చెప్పిన చంద్రబాబు కి ఇప్పుడు అదే సీబీఐ పై నమ్మకం ఎలా కల్గుతుందని ప్రశ్నించారు. బాబు అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. ఎన్నికలకు ముందు మోదీ జుట్టు…అది కుదరకపోయే సరికి ఇప్పుడు కాళ్లు పట్టుకోవడానికి ప్ర్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఆ పార్టీలో నేతలు వాస్తవాలు గ్రహించాలని..మంచి, చెడు గురించి ఆలోచించాలని అంబటి హితవు పలికారు.