అంబటి అత్యుత్సాహం: కరోనా భయమా.? కరెన్సీ అందలేదనా.?

Ambati Power Punch On Pawan Kalyan

Ambati Power Punch On Pawan Kalyan

బీజేపీ – జనసేన మధ్య స్నేహం విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోందా.? అంటే, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాటల్ని చూస్తే ఔనని చెప్పక తప్పదేమో. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆ చిత్ర బృందంలో పలువురికి కరోనా సోకింది. హీరోయిన్ నివేదా థామస్, నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డారు. మరోపక్క, ‘వకీల్ సాబ్’ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రత, సహాయ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డంతో.. పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళారు.

కానీ, అంబటి రాబాబు మాత్రం.. పవన్ కళ్యాణ్ విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేసేశారు. బీజేపీ నుంచి అందాల్సిన కరెన్సీ అందకపోవడం వల్లే పవన్ కళ్యాణ్, క్వారంటైన్‌లోకి వెళ్ళి వుంటారన్నది అంబటి ఉవాచ. ‘పైసలిస్తేనే తప్ప ప్రెస్ మీట్లు పెట్టని మీలాంటి రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్.. ఆయనకు రాజకీయ నిబద్ధత వుంది.. ఏమీ ఆశించకుండానే పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం తిరుపతిలో ప్రచారం చేశారు..’ అని జనసైనికులు, అంబటి రాంబాబుకి సోషల్ మీడియా వేదికగా ఎడా పెడా కౌంటర్లు పడేస్తున్నారు. మొదటి నుంచీ అంతే.. అంబటి రాంబాబుకి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడంలో ప్రత్యేక బాధ్యతలు అధిష్టానం అప్పగించినట్లుగా ఆయన వ్యవహరిస్తుంటారు.

పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు తదితరులూ, పవన్ విషయంలో ప్రత్యేక శ్రధ్ధ చూపుతుంటారు విమర్శలు చేయడానికి. కరోనా అన్నది చిన్న విషయం కాదు. కరోనా కారణంగానే తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది. కరోనా పేరు చెప్పి ఏ రాజకీయ నాయకుడి మీద అయినా ఇంకో రాజకీయ నాయకుడు విమర్శ చేస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అంబటి రాంబాబు కూడా గతంలో కరోనా బారిన పడ్డారు. ఆ బాధేంటో ఆయనకు తెలియకుండా వుంటుందా.? తెలిసీ ఎందుకీ రాజకీయ పైత్యం.? అన్నదే చాలామంది ప్రశ్న.