Amaravati : ‘ఇందులో ఒప్పుకోకపోవడానికేముంది.? మూడు రాజధానుల చట్టం రద్దయ్యింది గనుక, రాష్ట్రానికి రాజధాని అమరావతి. అయితే, మూడు రాజధానుల బిల్లు మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. అప్పటివరకు రాజధానిగా అమరావతి కొనసాగుతుంది..’ అని ఆ మధ్య నర్మగర్భంగా ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సి వచ్చింది.
మూడు రాజధానుల కోసం తెచ్చిన వికేంద్రీకరణ చట్టం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ విషయాన్ని అధికార పార్టీ, చట్ట సభల సాక్షిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇందులో పంతానికి పోయేదేమీ లేదు. ఏకైక రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటే, ఆ తర్వాత ఎన్ని రాజధానుల్నయినా కట్టుకోవచ్చు.
ఇక, రాజధాని అమరావతి విషయమై కేంద్రం నుంచి మరో స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది కాబట్టి, ప్రస్తుత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందని కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది.
ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వం.. రాజధానిపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, వికేంద్రీకరణ చట్టం రద్దయ్యింది గనుక, రాజధానికి సంబంధించి కేసుల విచారణ అవసరం లేదని పేర్కొంది. దీనర్థం. రాజధానిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్లే. అదొక్కటే రాజధాని అని ఒప్పుకున్నట్లే.
నిజానికి, ఎప్పుడో జరగాల్సిన పని ఇది. మూడు రాజధానుల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే నడిచాయి. విపక్షాలు మూడు రాజధానులకు అడ్డుపుల్ల వేశాయనడంలో అర్థమే లేదు. విపక్షాల్ని ఇరకాటంలో పడేసేందుకు మూడు రాజధానుల డ్రామాకి తెరలేపి, అధికార వైసీపీ బొక్కబోర్లా పడింది. ఇప్పుడు తీరిగ్గా చింతించి లాభం లేదు. కొత్త వివాదాలకు తావివ్వకుండా అమరావతిని అభివృద్ధి చేసుకుంటే అది రాష్ట్రానికీ, వైసీపీకీ లాభమే.