Work from Home: వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా..? ఇలా ట్రై చేయండి..!!

Work from Home: దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్నవేళ గతేడాది నుంచి ఉద్యోగస్తులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇందులో సాఫ్ట్ వేర్ తోపాటు పలు సంస్థల ఉన్నాయి. దీంతో సొంతూళ్లకు షిఫ్ట్ అయిన వారు ఉన్నారు. అయితే ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ, కొత్త పరిచయాలు, సహోద్యోగుల పలకరింపులు, జోక్స్, టైమ్ పాస్.. ఏదీ లేకుండా చాలామందికి బోర్ కొట్టేస్తోంది. కరోనా వేళ బయటకు వెళ్లలేరు.. పిల్లల అల్లరి, వంటింటి ముచ్చట్లు, టీవీ గోల మధ్య ఉండలేరు. ఆఫీసుల్లో చేయాల్సిన ఉద్యోగాలు ఇంట్లోనే ఏడాదిగా చేస్తుంటే.. బోరే కొడుతుంది మరి. పైగా.. అందరి ఇళ్లలో అంతగా సౌకర్యాలు ఉండకపోవచ్చు. ఇటువంటివారి కోసం వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‍సీటీసీ.

ఐఆర్‍సీటీసీ తీసుకొచ్చిన కాన్సెప్ట్ గతేడాది నుంచే ఉంది. అయితే.. కొత్తగా టూరిజం ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ విధానంలో కేరళలోని హోటళ్లలో కొన్ని రోజులు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,126. ఇందులో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. అయిదు రాత్రులు హోటల్లో బస, మూడు పూటలా భోజనం, రెండు సార్లు టీ లేదా కాఫీ ఇస్తారు. వైఫై సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల సైట్ సీయింగ్ కు అనుమతి ఉండదు. ఈ ప్యాకేజీ కేవలం స్థలం మార్పు, కొత్తా వాతావరణంలో ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఖాళీ సమయాల్లో హోటల్‍లో వాతావరణం ఎంజాయ్ చేయడమే.

కేరళలోని అలెప్పీ, మున్నార్, తెక్కడి, వాయనాడ్, కుమారకోమ్, కొచ్చిన్, కోవలం ప్రాంతాల్లోని హోటళ్లల్లో ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీ అందిస్తోంది. మొదట ఈ ప్యాకేజీ గడువు ఐదు రోజులు మాత్రమే. ఆ తర్వాత మరిన్ని రోజులకు పొడిగించుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా ఛార్జీలు మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేరళలోని మాత్రమే ఉన్న ఈ సదుపాయం త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి కూడా ఐఆర్‌సీటీసీ విస్తరించనుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నిజంగా ఇంట్లో వర్క్ చేసి బోర్ కొడుతున్నవారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. అయితే.. ప్రస్తుతం కేరళలో తుఫాను ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో ఐఆర్ సీటీసీ ఏమైనా మర్పులు చేసిందేమో తెలియాల్సి ఉంది.