ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన ‘మొంథా’ తుఫాన్ చివరికి బలహీనమైంది. రెండు రోజులుగా తీరప్రాంతాలను ముంచెత్తిన తుఫాన్ ఇప్పుడు తన దాటికి బ్రేక్ వేసుకుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, తీవ్ర తుఫాన్‌గా ఉన్న ‘మొంథా’ ప్రస్తుతం సాధారణ తుఫాన్‌గా మారింది. ఇక వచ్చే 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
తుఫాన్ బలహీనమైనా, వర్షాలు మాత్రం కొనసాగుతోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకాశం నల్లగా కమ్ముకుని ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గాలులు వేగంగా వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు కూడా వర్షాలకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలు కూడా తుఫాన్ మిగులు ప్రభావంతో తడిసిపోనున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పంటలు, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు మాట్లాడుతూ.. తుఫాన్ బలహీనపడినా వర్షాల తీవ్రత తగ్గలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి.. అని పేర్కొన్నారు.
