టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అలియాస్ చినబాబు ఆయన వ్యతిరేక వర్గంపై శమర శంఖం పూరించారా? మాటకు మాట…దెబ్బకు దెబ్బ సమాధానం చెప్పేలా సమాయత్తం అవుతున్నారా? ఈ విషయంలో టీడీపీ అధ్యక్షుడు, తండ్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహంతోనే స్టెప్ వేయనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది హైదరాబాద్ వర్గాల నుంచి. రాష్ర్టంలోకి కరోనా వైరస్ వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అవసరం మేర అమరావతికి వచ్చి వెళ్లారు తప్ప! అధికారం కోల్పోయిన నాటి నుంచి తండ్రీకొడుకులిద్దరు హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
అక్కడ నుంచి రాజకీయాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తిగా వర్చువల్ గానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమం 250 రోజులు పూర్తయినా వీడియోలోనే సంఘీభావాలు లాంటివి తెలిపారు. అలాగే సీఆర్ డీఏ స్పీడ్ అప్ అయ్యే సరికి తండ్రీకొడుకులిద్దరు సైలెంట్ అయిపోయారు. ఈ విషయంలో అమరావతి రైతులు కాస్త గుర్రుగానే ఉన్నారని వినిపిస్తోంది. అలాగే పార్టీ కోసం లోకేష్ చేసిందేంటని? కూడా సొంత పార్టీ నేతలే ప్రశ్నల పరంపర కురుస్తున్నట్లు వినిపిస్తోంది. సొంత వర్గమే చినబాబుని చేతగాని వాడిగా జమ కట్టేస్తున్నారు. పైకి చెప్పుకోకపోయినా లోలోపల పచ్చ తమ్ముళ్లంతా రగిలిపోతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది.
అలాగే విమర్శల్ని ఆరోపణల్ని తిప్పి కొట్టడంలో లోకేష్ మందగమనం గురించి చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే చినబాబు రూటు మారుస్తున్నట్లు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ఏ కామెంట్ ని వదిలిపెట్టకుండా ప్రతీ ఒక్కరికీ బదులిచ్చి సత్తా చూపించాలనుకుంటున్నాడుట. హైదరాబాద్ లో కూర్చుంటే పనవ్వదు…అమరావతి కి మకాం మార్చేసి రాజకీయాలు చేయాల్సిందేనని చినబాబు డిసైడ్ అయ్యాడుట. ప్రభుత్వ విధానాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ..తనకంటూ ఓ బ్రాండ్ ఉండేలా మార్క్ వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారుట. ఈ విషయంలో తండ్రి సూచనలు, సలహాలు తీసుకుని చాకచక్యంగా ముందుకు కదలాలని, అందుకు తగ్గ ప్రణాళిక వేసుకోవాలని భావిస్తున్నాడుట. మార్పు మంచిదే.