
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదాయె.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తప్పదాయె.. తెలంగాణకి గతంలో కేటాయించిన ఐటీఐఆర్ రద్దయ్యె.. తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం కుదరదాయె.! ఈ లిస్టు చదువుకుంటూ పోతే చాలానే వుంటుంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. కేంద్రం ఇంకాస్త స్పష్టంగా సమ ‘అన్యాయం’ చేసుకుంటూ పోతోంది రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రపదేశ్, తెలంగాణలకు. తాజాగా, ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేతలు కొత్త కథ మొదలు పెట్టారు. దుర్మార్గంగా కర్నాటక, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుని పెంచాలనుకుంటోందని చెబుతూనే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఈ విషయంలో బాధ్యత తీసుకుని, కేంద్రాన్ని కలవాలంటూ ఉచిత సలహా ఇచ్చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ‘అమరావతి ఎక్కడికీ వెళ్ళదు.. మూడు రాజధానులకు మేం వ్యతిరేకం..’ అని చెప్పిందీ ఈ ఏపీ బీజేపీ నేతలే.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డకుని తీరతామని చెప్పిందీ ఈ బీజేపీ నేతలే. అసలు ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేక హోదా అడిగింది కూడా బీజేపీ నేతలే.. ఇవ్వకుండా ‘నాటకాలు’ ఆడుతున్నది కూడా బీజేపీనే. తెలంగాణలో ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివాటికి ఎగనామం పెట్టింది కూడా బీజేపీనే కదా. కర్నాటకలో ఇప్పుడు అధికారం వెలుగబెడుతున్నది కూడా బీజేపీనే. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే, దిగువన తెలంగాణ, ఆంధ్రపదేశ్‌లలో వున్న ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయి. రాయలసీమ ఎడారైపోతుంది. తెలంగాణ సంగతి సరే సరి. మొత్తంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ అన్న పేరు మర్చిపోవాలేమో. రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ఈ ఆల్మట్టి వివాదం.. అలా అలా కొనసాగుతూనే వుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా తెలుగు నాట ప్రభుత్వాలన్నీ ఫెయిలవుతోంటే, కర్నాటకలో ప్రభుత్వాలు సక్సెస్ అవుతున్నాయి. కారణం కర్నాటక మీద కేంద్రంలో అధికారంలో వున్నవారికి గల ప్రత్యేక అభిమానమే
