ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసారు. ఏడాది పాలనలో భాగంగా సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టిన జగన్ ఇప్పుడు పార్లమెంట్ నియోజక వర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఉన్న 25 లోక్ సభ స్థానాల్ని ఆధారంగా చేసుకుని 25 జిల్లాలు లేదా! అంతకన్నా రెండు మూడు జిల్లాలు అదనంగా ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్లే…
ఉత్తరాంధ్రలో విశాఖపట్టణంతో పాటు అదనంగా ఎంపీ స్థానాలు కలిగిన అనకాపల్లి, అరకు జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా మూడుగా చీలి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా ఏర్పాటుకానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా రెండుగా విడిపోయి ఏలూరు, నర్సాపురం జిల్లాలుగానూ, కృష్ణా జిల్లా నుంచి విజయవాడ, మచిలీపట్నం జిల్లాలు, గుంటూరు నుంచి అదనంగా బాపట్ల, నర్సారావుపేట జిల్లాలు, చిత్తూరు నుంచి అదనంగా తిరుపతి, కడప నుంచి అదనంగా రాజంపేట, కర్నూలు నుంచి అదనంగా నంధ్యాల, అనంతపురం నుంచి అదనంగా హిందూపురం జిల్లాలు ఏర్పడనున్నాయి.
ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల్ని కలుపుతూ ఏర్పడనున్న అరకు నియోజకవర్గాన్ని ట్రైబల్ జిల్లాగా ఏర్పర్చడానికి ప్రభుత్వం ప్లాన్ లో ఉంది. అయితే తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ ఏర్పడబోయే కొత్త జిల్లాల్లో ఒక జిల్లాకు విప్లవ వీరుడు, మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. మన్యంవీరుడి 123వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖ బీచ్ ఒడ్డున అల్లూరి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈవిషయాన్ని మీడియాకు వెల్లడించారు. సీతారామరాజు పుట్టిన పద్మనాభ మండలంలోని పాండ్రంకిని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామన్నారు.
అలాగే అల్లూరి సమాధి ఉన్న కేడీ పేటను ప్రసిద్ది గాంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దానికి సంబంధిచి 200 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించామన్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఈ హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అయితే కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో ఏ జిల్లాకు మన్యం వీరుడి పేరు పెడతారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. విశాఖతో పాటు అనకాపాల్లి, అరకు రెండు జిల్లాలుగా ఏర్పడుతాయి. కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ట్రైబల్ జిల్లాగా ఏర్పాటు కాబోయే అరకు కే సీతారామారాజు జిల్లాగా నామకరణం చేసే అవకాశాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి.