జగన్ మంత్రి వర్గంలో కొలువు దీరిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లా పెత్తనంపై ఆ జిల్లాకు చెందిన నేతలు మంటెక్కిపోతు న్నారా? ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం పెద్దిరెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి-పెద్దిరెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే మంత్రిగా జగన్ కేబినేట్ లో కొలువుదీరారు. కానీ ఇప్పుడా పదవునే అడ్డుపెట్టుకుని సొంత జిల్లా అయినా చిత్తూరులో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జిల్లా మొత్తాన్ని ఆయన గుప్పిట్లోనే పెట్టుకుని నడిపిస్తున్నారుట.
దీంతో అదే జిల్లాకు చెందిన నేతలు, కీలక వ్యక్తులు పెద్దరెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ ఐఐసీ చైర్మన్ రోజాకి-పెద్దిరెడ్డి కి మధ్య వివాదం తలెత్తింది అన్నది తెలిసిందే. ఈ వివాదం ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి దగ్గరకు చేరింది. తాజాగా రోజా ఇప్పుడు వచ్చిన తాజా అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాకు చెందిన అసంతృప్తిగా ఉన్న నేతల్నందరినీ పెద్దిరెడ్డిపై కి ఉసిగొల్పినట్లు సమాచారం. పెద్దిరెడ్డి కారణంగా పైకి రాలేకపోతున్న నేతలు, ప్రభుత్వ పథకాలు కోల్పోయిన అసంతృప్తులంతా పెద్దిరెడ్డిపై ఎటాక్ కి దిగినట్లు ఇన్ సైడ్ టాక్.
ఇన్నాళ్లు భయపడిన నేతలంతా పెద్దిరెడ్డిపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారుట. ఎన్నాళ్లీ నియంత పాలనని క్వశ్చన్ చేస్తున్నారుట. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా పెద్దిరెడ్డిపై ఓకన్నేసే ఉన్నారని, ఇప్పుడు ఆయన కూడా పెద్దిరెడ్డి వైఖరిపట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పెద్దిరెడ్డిని ఇప్పుడు కేవలం తన శాఖకి, నియోజక వర్గానికి మాత్రమే పరిమితం కావాలని, జిల్లాల్లోని మిగతా నియోజక వర్గాల్లో గానీ, ఇతర విషయాల్లోగానీ వేలు పెట్టొద్దని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. మరి మొన్నటివరకూ మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్న పెద్దిరెడ్డి నెత్తిన ఈ కొత్త సమస్యలేంటో.