Crime News: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎవరు ఎన్ని చెప్పినా తాగుడుకు అలవాటు పడిన వారు మాత్రం తగ్గేదెలా అన్న రీతిలో తాగుతుంటారు. తాగిన మైకంలో వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఒక వ్యక్తి, మరొక వ్యక్తిని కొట్టి హత్య చేశాడు. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిలుకూరు గ్రామానికి చెందిన 25 సంవత్సరాల మల్లేష్ ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను శంషాబాద్లోని సిద్ధాంతి లో నివాసం ఉంటున్నాడు. ఇతను మార్చి 11 శుక్రవారం నాడు కాటేదాన్ వైన్స్ లో మద్యం సేవిస్తున్న సమయంలో గగన్ పహాడ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న బీహార్కు చెందిన 29 ఏళ్ల జబారత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కాసేపు ముచ్చటించిన తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి మరొకసారి మద్యం సేవించడానికి గగన్ పహాడ్ లోని అప్పా చెరువు సమీపంలోని శీతలమైన భవంతి వద్దకు వెళ్లారు.
మద్యం సేవించిన తర్వాత, తాగిన మైకంలో ఇద్దరు మాట మాట అనుకొని, అది కాస్తా గొడవకు దారి తీసింది. కోపంతో ఉన్న మల్లేష్ పక్కనే ఉన్న బండరాయిని తీసుకొని జబారత్ తల మీద కొట్టాడు. తీవ్రంగా గాయపడిన జబారత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు మల్లేష్ నేరుగా ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్ కు చేరుకొని జరిగిన హత్య గురించి చెప్పి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.