స్టార్ కిడ్ అయ్యుండి, మంచి క్రేజ్ ఉన్నా కూడ నిలదొక్కుకోలేకపోతున్న హీరో అఖిల్ అక్కినేని. మొదటి సినిమా ‘అఖిల్’తో యాక్షన్ హీరో అవ్వాలని ఆశపడ్డాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో లవ్ ట్రాక్ ఎక్కాడు. వరుసగా ‘హలో, మిస్టర్ మజ్ను’ లాంటి చిత్రాలు చేశాడు. కానీ అవి కూడ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో హీరోగా ఒక్క హిట్ కూడ ఖాతాలో వేసుకోలేకపోయాడు అఖిల్. అటు యాక్షన్ సినిమాలు కలిసిరాక ఇటు లవ్ ఎంటర్టైనర్లతో గట్టెక్కలేక సతమతమైన ఈ అక్కినేని వారసుడు ఈసారి కామెడీని నమ్ముకున్నాడట. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా చేశాడు. సినిమా దాదాపు పూర్తైంది.
టైటిల్, టీజర్ చూస్తే సినిమాలో మంచి ప్రేమ కథ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయని, బహుశా అందుకే అఖిల్ ఆ సినిమాకు ఒప్పుకిని ఉండవచ్చని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. సినిమాలో లవ్, ఫ్యామిలీ వినోదం కంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందట. అసలు అఖిల్ ఈ కథను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కామెడీనే అంటున్నాడు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. నరేషన్ ఇస్తున్నంతసేపు అఖిల్ నవ్వుతూనే ఉన్నాడని, సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశాడని చెబుతున్నాడు. అఖిల్ మాత్రమే కాదు కథ విన్న నాగార్జునకు సైతం కామెడీ ట్రాక్స్ బ్రహ్మాండంగా నచ్చాయట. అందుకే ఆయన కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో.. మొత్తానికి ఈసారి అఖిల్ హిట్ కోసం కామెడీని నమ్ముకున్నాడన్నమాట.