తెలంగాణలో తెరాస ఎంత బలమైన పార్టీనో హైదరాబాద్లో ఎంఐఎం అంతే బలమైన పార్టీ. ఓల్డ్ సిటీలో ఆ పార్టీదే హవా. అక్కడ రాజకీయమంతా అక్బరుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే నడుస్తుంది. అందుకే కేసీఆర్ ఒవైసీతో సాన్నిహిత్యంగానే ఉంటారు. హైదరాబాద్ విలక్షణతను ద్రుష్టిలో ఉంచుకుని ఎంఐఎం పార్టీతో గొడవ కంటే పొత్తే నయమనేది కేసీఆర్ ఆలోచన. ఒవైసీ సైతం కేసీఆర్ మాటకు విలువిస్తారు. అందరి మీద లేచినట్టు కేసీఆర్ మీదకు ఒంటి కాలుతో లేవరు. ఇలా ఒవైసీ, కేసీఆర్ ఇద్దరూ పరస్పర అవగాహనతో నడుచుకుంటూ ఉండటాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతూ ఉంటుంది. తెలంగాణలో హిందూత్వానికి విలువ లేకుండా చేస్తున్నారని కేసీఆర్ మీద విరుచుకుపడుతుంటారు.
కానీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్భరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పనపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన ఒవైసీ హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ తీసుకురావడానికి తాను చాలా కృషి చేశానని కానీ తన ఏరియాకు మాత్రం మెట్రో రాలేదని, ఎప్పుడొస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
అలాగే కేసీఆర్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అన్నారు. కానీ 400 ఏళ్లుగా పాతబస్తీ సౌకర్యాల కోసం అల్లాడుతోంది. రోడ్ల వెడల్పు పనులు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నాయి. చార్మినార్ పనులు ముందుకు సాగట్లేదు. ఓల్డ్ సిటీలో అనేక పర్యాటన ప్రాంతాలున్నాయి. కనీసం పాతబస్తీకి మంచినీరు కూడ సక్రమంగా అందట్లేదు. 4 వేల ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్ సాగర్ ఇప్పుడు వెయ్యి ఎకరాలే ఉంది. మూసీ నది ఎప్పుడు శుభ్రమవుతుంది. ఓల్డ్ సిటీ కోసం 10,000 కోట్లు కేటాయించండి అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ఒవైసీ ఎవరితో ఎలాంటి పొత్తు పెట్టుకున్నా ఓల్డ్ సిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటారని, అవసరమైతే పోరాడతారనే పేరుంది. ఆ పేరుకు తగ్గట్టే ఆయన కేసీఆర్ మీద ఈరోజు ప్రశ్నల వర్షం సంధించారు.