జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ… హైదరాబాద్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే… హైదరాబాద్ లో ముఖ్యంగా పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. ఎంఐఎం కూడా ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే.. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. దమ్ముంటే.. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్లను తొలగించాలంటూ ఆయన సవాల్ విసిరారు.
అప్పట్లో హుస్సేన్ సాగర్ ను 4700 ఎకరాల్లో తవ్వారని.. కానీ.. ప్రస్తుతం మాత్రం అది 700 ఎకరాలకు పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది… అలాగే నాలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వమే చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆఫీసు కూడా నాలా మీదనే నిర్మించారు.. అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు.
అయితే.. అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు అనుచితమంటూ మంత్రి కేటీఆర్ ఖండించారు.