Airports Or Capitals : విమానాశ్రయాలా.? రాజధానులా.? ఏది ముఖ్యం.!

Airports Or Capitals : ఎయిర్ పోర్టులు అవసరమా.? రాజధానులు అవసరమా.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ జరుగుతోందో లేదోగానీ, తెలుగునాట సోషల్ మీడియా వేదికగా పడుతున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన కామెడీని మించి, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో విమానాశ్రయాల పేరుతో కామెడీ జరుగుతోంది.

జిల్లాకో విమానాశ్రయం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారులతో సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఇది పాత వ్యవహారమే. చంద్రబాబు హయాంలో జిల్లాకో విమానాశ్రయం.. అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు. అంతేనా, అప్పట్లో చాలా కామెడీలు నడిచాయి. స్మార్ట్ సిటీలన్నారు, మెగా సిటీలన్నారు. అంతా హంబక్కే అయ్యింది.

ఏళ్ళు గడుస్తున్నా ఈ స్మార్ట్ సిటీల వ్యవహారంపై కేంద్రం పెదవి విప్పడంలేదు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక తెరపైకొచ్చిందీ స్మార్ట్ సిటీల కాన్సెప్ట్. స్మార్ట్ సిటీలంటే రాత్రికి రాత్రి అయిపోయేవి కావు. లక్షల కోట్ల బడ్జెట్ ఆయా నగరాలకే పెట్టాల్సి వస్తుంది. ఏళ్ళ తరబడి కఠోరమైన శ్రమతో కూడుకున్న వ్యవహారం. దానికి బోల్డంత చిత్తశుద్ది కూడా వుండాలి.

సరే, ఇప్పుటు విమానాశ్రయాల విషయానికొద్దాం. ఏదో అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించేసినట్టు, జిల్లాకో విమానాశ్రయం.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించేశారు. చంద్రబాబు హయాంలో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం దగ్గర) ప్లానింగ్ జరిగింది. అదింతవరకు కార్యరూపం దాల్చలేదు.

మరెలా, జిల్లాకో విమానాశ్రయం.. అని అనగలుగుతారు.? ఏదో ఉత్తినే సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోవడంలేదు. రాష్ట్రానికి ఇప్పుడు ముందుగా కావాల్సింది రాజధాని. ఒకటే కడతారో, మూడే కడతారోగానీ.. రాజధాని లేదా రాజధానుల నిర్మాణమైతే ప్రారంభమయి తీరాలి. అంతే తప్ప, విమానాశ్రయాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తే జనం నవ్విపోతారు.!