Air Port In Every District : జిల్లాకో విమానాశ్రయం.! రోడ్ల దుస్థితికి మోక్షమెప్పుడు జగన్ సారూ.!

Air Port In Every District : ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో జిల్లాకీ ఒక్కో విమానాశ్రయం వుండేలా చేస్తామంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చితే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కు విమానాశ్రయాలున్నాయి. తెలంగాణకి ఒకే ఒక్క విమానాశ్రయం వుంది.. అదే శంషాబాద్ విమానాశ్రయం.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విమానాశ్రయాలున్నాయి. నిజమే, విమానాశ్రయాలు పెరిగితే ఎయిర్ కనెక్టివిటీ ఇంకా పెరిగి, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. కానీ, ఆకాశమార్గాన ప్రయాణించేవారెంతమంది.? రోడ్డు మార్గాన ప్రయాణించేవారెంతమంది.?

గత కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా వుంది. ఆయా రోడ్లను మరమ్మత్తులు చేయడానికే వైఎస్ జగన్ సర్కార్ పూనుకోవడంలేదు. ‘ఇదిగో చేస్తున్నాం.. అదిగో చేస్తున్నాం..’ అంటూ ఏళ్ళు గడిపేస్తోంది. రెండున్నరేళ్ళుగా రోడ్ల మీద గోతులు పెద్దవయ్యాయి తప్ప, తగ్గని పరిస్థితి.

రోడ్ల దుస్థితి ఇలా వుంటే, కొత్త విమానాశ్రయాల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాల్సిందే. అందుకు జిల్లాకి ఒక విమానాశ్రయమేం ఖర్మ.. ఎన్నయినా పెట్టుకోవచ్చు. కానీ, అసలంటూ రోడ్లు సరిగ్గా వుండాలి కదా.

రాజధాని అమరావతి విషయంలోనూ అదే తంతు. వున్న ఒక్క రాజధాని అమరావతిని అభివృద్ధి చెయ్యడం మానేసి, మూడు రాజధానులన్నారు. ఒకటీ లేదు, మూడూ లేదు.. మొత్తంగా గుండు సున్నా అయిపోయింది రాజధాని అభివృద్ధి విషయానికొస్తే. ఇప్పుడీ విమానాశ్రయాల పరిస్థితి అంతేనా.?