ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది. గత ఆరు నెలలకు పైగా స్వేచ్ఛా జీవితం గడప లేని ప్రజలు వ్యాక్సిన్ వస్తే మళ్లీ స్వేచ్ఛా జీవితం గడపవచ్చని భావిస్తోన్నారు. వ్యాక్సిన్ వస్తే గతంలా జీవితాన్ని సంతోషంగా సాగించాలని చూస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చి జనవరి నాటికి ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారు.
ఇండియా టుడే హెల్త్‌గిరి అవార్డ్స్, 2020 సందర్భంగా డాక్టర్ గులేరియా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం కొనసాగుతోన్న ప్రయోగాలు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ నిరోధంలో వ్యాక్సిన్ సమర్థత లాంటి చాలా అంశాలపై వ్యాక్సిన్ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసారు. ముందు నుంచి నిపుణులు చెబుతున్నట్లే గులేరియా కూడా అదే చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో సవాళ్లు తప్పవని అన్నారు. వ్యాక్సిన్ సిద్ధమైతే దానిని ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం కూడా సవాలు అని అన్నారు. వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యతా క్రమాన్ని పాటించకపోతే మరణాల సంఖ్య పెరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేసారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 63,94,069 కు చేరుకుంది. అలానే కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 99,773కి చేరింది. శనివారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి 53,52,078 మంది కోలుకోగా, 9,42,217 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 83.70 శాతానికి చేరుకోవడం శుభపరిణామం కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.