ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారిపోవచ్చు.. రాజధాని స్థానంలో రాజధానులు ఎన్నయినా రావొచ్చు.. అన్న సంకేతాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపుతోందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసే పక్ర్రియలో వైసీపీ కూడా పాలుపంచుకుంది. ‘మేం ఎంపిక ప్రక్రియలో లేం.. టీడీపీ ప్రకటించేశాక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అమరావతికి మద్దతిచ్చామంతే..’ అని వైసీపీ చెప్పొచ్చుగాక. కానీ, అప్పట్లో అసెంబ్లీలో ఆ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించలేదు గనుక.. అమరావతి.. ఆంధ్రపదేశ్ రాజధాని అవడంలో వైసీపీ తనవంతు పాత్ర పోషించినట్లే లెక్క. ఇప్పుడిక విశాఖ వేదికగా పరిపాలన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అతి త్వరలో మూడు రాజధానులు.. అంటూ వైసీపీ ముఖ్య నేతలు సంకేతాలు పంపుతున్నారు. మరి, విశాఖ అందుకు సిద్ధంగానే వుందా.? తిరుపతికి వున్న భౌగోళిక ప్రతికూలతలు, విశాఖ అభివృద్ధికి సహకరిస్తాయా.? అన్న ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే. విశాఖ పెద్ద నగరం, అభివృద్ధి చెందిన, చెందాల్సిన నగరం కూడా. అయితే, భౌగోళిక ప్రతికూలతలు రాజధాని అనే అర్హత నుంచి విశాఖని దూరం చేస్తున్నాయి.
అమరావతి మీద కోపంతోనో, చంద్రబాబు మీద కోపంతోనో.. అమరావతి నుంచి పాలనను విశాఖకు వైఎస్ జగన్ తరలిస్తే, తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.? రేప్పొద్దున్న ప్రభుత్వం మళ్ళీ మారితే, మూడు రాజధానుల స్థానంలో ఐదో, ఏడో.. తొమ్మిదో, పదమూడో రాజధానులు వస్తే ఏంటి పరిస్థితి.? మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంచిదే. కానీ, పరిపాలన వికేంద్రీకరణ.. అనేది ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆ తలనొప్పులు అధికారంలో వున్నవారికి తాత్కాలికమే.. అధికార యంత్రాంగం సమస్యలే శాశ్వతం.. రాష్ట్ర పురోగతికీ ఈ సమస్యలు ఆటంకం కలిగిస్తాయి.