రాజులు, రాజ్యాలు.. అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ దృష్టిలో నిజాం పరిపాలన గొప్పది. అలాగని, నిజాం హయాంలో చోటు చేసుకున్న హింసని సమర్థించగలమా.? టిప్పు సుల్తాన్ మీద కొందరు కొత్తగా ప్రేమ కురిపిస్తున్నారిప్పుడు.. ఆ టిప్పు సుల్తాన్ హయాంలో హిందువులపై జరిగిన దాడుల మాటేమిటి.? ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అయితే, బ్రిటిష్ వారి వల్లే దళితులకి దేవుడు ఏసుక్రీస్తు లభించాడని చెప్పుకొచ్చాడు.
కానీ, ఆ బ్రిటిష్ హయాంలో దేశంలో జరిగిన మారణ హోమం సంగతేంటి.? రాజకీయ నాయకులు సందర్భానుసారం.. రాజకీయ అవసరాల కోసం అసందర్భ ప్రస్తావన తీసుకొస్తుంటారు. ప్రస్తతుం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుని విమర్శించే క్రమంలో విజయనగరం రాజుల చరిత్రను తవ్వడం కూడా అసందర్భంగానే కనిపిస్తోంది.
గజపతిరాజులకీ, బొబ్బలి రాజులకీ మధ్య పోలిక తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి. నిజమే.. బొబ్బిలి రాజులంటే పౌరుషానికి ప్రతీక. విజయనగరం రాజులు, బ్రిటిషర్లకు లొంగారు. కానీ, అటు బొబ్బిలి రాజులైనా, ఇటు విజయనగరం రాజులైనా ప్రజారంజకమైన పాలననే అందించారు. అందుకే, వారి వారసులకి ఇప్పటికీ అక్కడ తగిన గౌరవం లభిస్తోంది.. ప్రస్తుత ప్రజాస్వామ్య భారతంలో. రాజకీయాల్లోకి వచ్చాక ఎవర్నయినా విమర్శిస్తాం.. అన్నది ఓ హద్దు వరకూ బాగానే వుంటుంది.
గజపతి రాజుల్ని, బొబ్బలి రాజులతో పోల్చడం అసందర్భ ప్రస్తావన. ఆ మాటకొస్తే, బ్రిటిష్ హయాంలో.. ఆయా ప్రాంతాల్లో సామంతులు (ప్రధానంగా రెడ్లు), బ్రిటిషర్లకు లొంగిపోయి.. ప్రజల్ని హింసించారు. అలాగని, రెడ్డి సామాజిక వర్గం మొత్తాన్నీ తప్పుపట్టగలమా.? విజయసాయిరెడ్డి అంటే ఆచి తూచి మాట్లాడే వ్యక్తి ఒకప్పుడు. ఆయనిప్పుడెందుకో మాటమీద అదుపు కోల్పోతున్నారు. అది పరోక్షంగా ప్రతిపక్షానికి మేలు చేస్తోంది.. ప్రతిపక్షంపై ప్రజల్లో సింపతీ పెరగడానికి కారణమవుతోంది. అదే సమయంలో వైసీపీ ఇమేజ్ డ్యామేజీ అయ్యేలా చేస్తోంది.