Buddha Venkanna Arrest : ఏదో జరిగిపోతుందని హంగామా చేసేశారు. చివరికి ఏమీ జరగలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి, విచారించి, నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసేశారు. నిన్న ఉదయం నుంచి నడిచిన హైడ్రామాకి, నిన్న అర్థరాత్రితో ముగింపు పడింది.
మంత్రి కొడాలి నానిపై విపరీత వ్యాఖ్యలు చేశారనీ, డీజీపీ మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్నది బుద్ధా వెంకన్నపై ఆరోపణ. అది నిజం కూడా. కానీ, బుద్ధా వెంకన్న కంటే ముందు మంత్రి కొడాలి నాని, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద నోరు పారేసుకున్నారు. మరి, అప్పుడు పోలీసులు ఏం చేసినట్టు.?
ఇక్కడ, వైసీపీ నేత ఒకరు బుద్ధా వెంకన్న మీద ఫిర్యాదు చేశారు గనుక, కేసు నమోదైంది.. పోలీసులు బుద్ధా వెంకన్నని అరెస్ట్ చేశారు. మరి, టీడీపీ నేతలెందుకు కొడాలి నాని మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.? ఒకవేళ చేసినా పోలీసులు స్పందించలేదా.? ఈ విషయమై స్పష్టత రావాల్సి వుంది.
ఒక్కటి మాత్రం నిజం, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విపక్ష నేతల అరెస్ట్.. అన్న వాదనకు బలం చేకూరేలా విపక్షాలకు చెందిన నేతల అరెస్టులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ ప్రతిసారీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారికి న్యాయస్థానాల్లోనూ చుక్కెదురవుతోన్న దరిమిలా, పోలీస్ వ్యవస్థ.. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వుంది.
అన్నట్టు, అరెస్టయితే కొంపలేమీ మునిగిపోవనీ, బెయిల్ తెచ్చుకునే అవకాశం వుంటుందనీ.. తెలిసీ టీడీపీ నేతలు ప్రతిసారీ ఎందుకు హైడ్రామా క్రియేట్ చేస్తున్నట్టు.? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.