సుజాత గారిని గుర్తించని సినీ ప్రేక్షకులు ఉండరు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన అందాల బొమ్మ సుజాత. సుజాత గారు 1952లో కేరళలో జన్మించారు. అయితే ఈమె తండ్రి ఉద్యోగరీత శ్రీలంకలో జీవనం సాగించారు. ఆమె అక్కడే పెరిగి పెద్దయ్యారు.తండ్రి రిటైర్మెంట్ తర్వాత అంతా కలిసి చెన్నైలో స్థిరపడ్డారు.
సుజాత గారు 14 సంవత్సరాల వయసులోనే సినీ రంగాప్రవేశం చేశారు. తమిళంలో కే.బాలచందర్ గారి దర్శకత్వంలో అంతులేని కథ తమిళ్ వర్షన్ లో వచ్చిన సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. తరువాత తెలుగులో దాసరి నారాయణరావు గారు శోభన్ బాబు హీరోగా నటించిన గోరింటాకు సినిమా ద్వారా సుజాతను తెలుగులో పరిచయం చేశారు.
దాదాపు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అందరూ అగ్ర హీరోల సరసన నటించారు.1991లో నటించిన పెళ్లి సినిమా ద్వారా ఉత్తమ నటిగా నంది అవార్డు పొందారు. తమిళంలో ప్రతిష్టాత్మకమైన కలయిమాను పురస్కారం పొందారు. ఏడు అంతస్తుల మేడ, సుజాత, సంధ్య, గోరింటాకు, సూరిగాడు, వంశ గౌరవం, చంటి, సూత్రధారి , పెళ్లి వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇలా సినిమా జీవితం అవకాశాలు వస్తూ బాగానే ఉన్నా ఆమె నిజజీవితంలో మాత్రం కష్టాలు చవిచూశాయి.
సుజాత గారు ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ ఇంటి యజమాని కుమారుడు జయకర్ హెన్రిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈమెకు దివ్య, సాజిత్ అనే ఒక అమ్మాయి , ఒక అబ్బాయి ఉన్నారు. ఆ తరువాత అమెరికాకు వెళ్ళిపోయారు. అక్కడి పద్ధతులు, సాంప్రదాయాలు నచ్చని సుజాత గారు తిరిగి ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు. సుజాత గారు తెలుగులో చివరగా శ్రీరామదాసు సినిమాలో నటించారు. 58 సంవత్సరాలు ఉన్న సుజాత గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న చెన్నైలో మరణించారు.