ఈఎస్ ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అచ్చెన్న ఆరోగ్యం కుదుటపడటంతో బుధవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. అనంతరం ఆయన్ని నేరుగా విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. అయితే అంతకుముందు అచ్చెన్న అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని కోరారు. దీనిలో భాగంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ కు అచ్చెన్న లేఖ రాసారు.
కొలనోస్కోపీ పరక్షా ఫలితాలు ఇంకా రాలేదు. కరోనా పరీక్షలు చేయకుండా జైలు అధికారులు అనుమతించరు. కాబట్టి కరోనా పరీక్షలు చేయాలని లేఖలో కోరారు. కానీ వైద్యులు ఆయన లేఖతో పనిలేకుండా డిశ్చార్జ్ చేసేసారు. దీంతో ఆసుపత్రి వద్దకు తెలుగు దేశం కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నను ప్రత్యేక భద్రత నడుమ జైలుకు తరలించారు. ఆసుపత్రిలోని గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి తోపులాటలు జరిగి పరిస్థితి అదుపు తప్పకుండా ఆసుపత్రి బయట పోలీసులు పెద్ద రోప్ ఏర్పాటు చేసి అచ్చెన్నను అత్యంత జాగ్రత్తగా జైలుకి తరలించారు. ఆ సమయలో తేదాపా కార్యకర్తలు కాస్త హడావుడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు చెదరగొట్టడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈఎస్ఐ స్కాంలో అవినీతిలో రిమాండ్ లో ఉన్న అచ్చెన్నను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు మొత్తం పన్నెండున్నర గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అధికారులు అడిగిన ప్రశ్నలకు అచ్చెన్న సరైన సమాధానాలు చెప్పలేదు. ఏ ప్రశ్నకు మనసు విప్పి బధులివ్వలేదని అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లు ఏసీబీ అధికారులు నుంచి తెలిసింది. దీంతో అచ్చెన్నను మరోసారి కస్టడీకి తీసుకుంటారా? లేదా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.