Accident: తమ్ముడి అమెరికా ప్రయాణం.. ప్రాణాలు కోల్పోయిన తండ్రి,సోదరుడు..!

Accident: ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యాక్సిడెంట్ వల్ల కొంత మంది ప్రాణాలతో బయట పడినప్పటికీ, కొంత మంది అక్కడికక్కడే మృత్యు వాత పడుతున్నారు. దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య వల్ల తరచు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ ఎంతో మందికి తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నాయి. వెహికల్ నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవటంవల్ల రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇటీవల ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం వద్ద ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది.గుంటూరు జిల్లా చిలకలూరుపేట లంబాడీడొంకకు చెందిన చౌడా వెంకట్రావు(55), కళావతి దంపతుల ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రసన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఈయన ఇంటివద్దే ఉంటున్నారు. చిన్న కుమారుడు భాస్కర్ కు అమెరికాలో చదివే అవకాశం రాగా అతన్ని అమెరికాకు పంపించడానికి కుటుంబమంతా కలిసి చెన్నై బయలుదేరారు.

చిన్న కుమారుడిని అమెరికాకు పంపించడానికి తల్లిదండ్రులు సోదరులు కలిసి బుధవారం రాత్రి చెన్నైకి బయలుదేరారు. చిన్న కుమారుడు భాస్కర్ ని విమానం ఎక్కించి తిరిగి తమ సొంత ఊరికి కారులో పయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు జాగర్లమూడివారిపాలెం హైవే వంతెనకి చేరుకున్నారు. అదే సమయంలో ముందు వెళుతున్న కట్టెల ట్రాక్టర్ ను వీరి కారు బలంగా ఢీకొట్టింది. కారులో వెంకట్రావు ప్రసన్న కూర్చున్న వైపు ట్రాక్టర్ ట్రాలీ కిందికి దూసుకెళ్లి పోయింది. దానితో వారిరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ వైపు కూర్చున్న కళావతి డ్రైవర్ ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని సందేహ పడుతున్నారు.