ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రాజధాని అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. 2014 నుండి 2019 వరకు అమరావతి చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు మూడు రాజధానుల చుట్టూ తిరుగుటున్నాయి. అయితే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. టీడీపీ హయాంలో అక్కడ టీడీపీ నాయకులే భూములు కొన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రకటన సెప్టెంబర్ 3, 2015న జరిగింది.
అయితే 2014లోనే అసైన్డ్ భూముల చట్టం, ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగినట్లు గుర్తించారు.
ఇప్పటికే అక్కడ అక్రమాలకు పాల్పడిన వారికి సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. త్వరలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ఏసీబీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే అక్రమ కొనుగోలు చేసిన వారిలో ముగ్గురు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిపై అధికారులు ఎప్పుడైనా దాడులు చేయవచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ అక్రమాల్లో నారా లోకేష్ కు కూడా సంబంధం ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడును, టీడీపీ నాయకులను వైసీపీ ప్రభుత్వం వదలని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ అధికారులు ఎప్పుడు వస్తారోనని అక్రమాలకు పాల్పడిన ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని సమాచారం.