KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏ క్షణమైనా మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కావచ్చు అంటూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ మాట వినపడుతూనే ఉంది. ఇక కేటీఆర్ సైతం ఇలాంటి బెదిరింపులకు తాను భయపడను అంటూ చెబుతూ వచ్చారు..
ఇదిలా ఉండగా తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో గతంలో కేటీఆర్ విచారణకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులను జారీ చేసింది. ఇలా కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటనికి , ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.. ముఖ్యమంత్రి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందని కవిత ఆరోపించారు. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు కవిత. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదనీ కవిత చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
ఇలా కేటీఆర్ కు నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ కు జారీ చేసిన నోటీసులలో భాగంగా ఈ నెల 28వ తేదీ కేటీఆర్ విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే ముందుగానే కేటీఆర్ తనకున్నటువంటి షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం విదేశాలలో ఉన్న నేపథ్యంలో ఈనెల 28వ తేదీ విచారణకు హాజరు కాలేనని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని అంతవరకు నాకు సమయం కావాలి అంటూ ఈయన కోరారు.