ABN RK : ఏబీఎన్ ఆర్కే మార్కు ‘స్కిల్’ డెవలప్మెంట్.!

ABN RK : ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు హయాంలో ఈ కుంభకోణం జరిగినట్లు ఏపీ సీఐడీ చెబుతోంది. ఈ మేరకు గతంలోనే ఏసీబీ విచారణ చేపట్టాల్సి వుండగా, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ విచారణ ఆగిపోయిందన్నది వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్నమాట.

సరే, కేసు విచారణ సందర్భంగా అరెస్టుల పర్వం అనేది సర్వసాధారణమైన విషయం. నిందితుల అరెస్ట్, ఆ తర్వాత కోర్టులో వాదనల త్రవాత ఏం జరుగుతుందన్నది వేరే చర్చ. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అనుకూల మీడియాగా చెప్పబడే ఏబీఎన్ మీడియా సంస్థకు సంబంధించిన పత్రిక, ఛానల్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.

స్వయంగా ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ, తన స్నేహితుడ్ని ఏపీ సీఐడీ విచారిస్తుండడంతో అక్కడికి వెళ్ళి అడ్డంగా ఇరుక్కున్నారు. పత్రికాధినేత అయిన రాధాకృష్ణకి, సీఐడీ లాంటి విచారణ సంస్థలు విచారణ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళకూడదనీ, వెళ్ళినా.. అక్కడివారు తనకు సన్నిహితులైనంతమాత్రాన.. హల్‌చల్ చేయకూడదనీ తెలియదా.?

పైగా, తాను అలా వెళ్ళడానికి సంబంధించి వివరణ ఇచ్చుకుంటూ, తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, కేసు పెట్టి వుండేవారు కదా.. అంటూ దీర్ఘాలు తీశారు. ఇంకేముంది, ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అదిప్పుడు తెలంగాణ పోలీసులు విచారణ చేయాల్సి వుంది.

తన మీడియా ద్వారా మేగ్జిమమ్ స్కిల్ చూపిస్తూ, ఈ కేసు విషయమై జగన్ సర్కారుని ఇరకాటంలో పడేయాలని చూస్తూ, తానే స్వయంగా ఇరకాటంలో పడిపోయారిప్పుడు ఏబీఎన్ ఆర్కే.