రాధాకృష్ణ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన  సోము వీర్రాజు

Somu Veeraju
పాపం…ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు రోజులు బాగున్నట్లు లేవు…తెలంగాణాలో కేసీఆర్ తో సున్నం పెట్టుకుని ఆయన ఆగ్రహానికి గురయ్యాడు..ఏనాడైతే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు తెలంగాణను వదిలేసి అమరావతికి పారిపోయాడో  ఆనాటినుంచి కేసీఆర్ రాధాకృష్ణకు బద్ధ శత్రువుగా మారిపోయారు.  పోనీ, తెలంగాణాలో పరువు పొతే పోయింది, ఆంధ్రప్రదేశ్ లో మనవాడిదే కదా రాజ్యం  అని సరిపెట్టుకుందామనుకుంటే చంద్రబాబు కాస్తా మోడీ కారం పూసుకుని  పదవీభ్రష్టుడై కేవలం ఇరవై మూడు సీట్లతో పరువు కూడా పోగొట్టుకున్నాడు.  ఎనిమిదేళ్లనుంచి తాను విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడంతో ప్రకటనల పేరుతో, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో దోచుకుంటున్న ధనప్రవాహానికి అడ్డుకట్ట పడిపోయింది.  తెలుగుదేశం పార్టీ ఓడిపోవడమే కాక, తాను మహామేధావిగా ఊదరగొడుతున్న లోకేష్ నాయుడు మొదటిసారి ఎన్నికల్లోనే చిత్తుగా ఓడిపోవడం రాధాకృష్ణకు దిగ్భ్రాంతి కలిగించి ఉంటుంది. 
 
Somu Veerraju
 
పాతికేళ్ళు, యాభై ఏళ్ళు చంద్రబాబే పరిపాలిస్తాడని, అమరావతి పేరుతో దోచుకోవచ్చని కన్న కలలన్నీ భగ్నం అయిపోవడం రాధాకృష్ణను కలవరపరించింది.  చంద్రబాబు సైతం తన పరాజయం పట్ల నిశ్చేష్టుడై ఆరు నెలల దాకా మాట్లాడలేకపోయాడు.  పచ్చ మీడియా అధిపతులు అమరావతిలో కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారని బోలెడన్ని ఆరోపణలు వినిపించాయి.  రాజధాని వికేంద్రీకరణతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోవడంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దురదగొండాకు రాసుకున్న పిచ్చివాళ్లలా అటూ ఇటూ దిక్కులు తెలియక పరిగెడుతున్నారు.  
 
తెలంగాణాలో కేసీఆర్ తో శత్రుత్వం, ఆంధ్రాలో జగన్ తో శత్రుత్వం….అంటే ఒకవైపు నాగుబాము, మరొకవైపు తాచుపాము…ఇద్దరూ బుసలు కొడుతుండటంతో ఏమి చెయ్యాలో పాలుపోక మోడీని ప్రసన్నం చేసుకోవాలని తలచి చంద్రబాబుతో పాటు మోడీ  భజనను ప్రారంభించాడు రాధాకృష్ణ.    ఎందుకంటే పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని సాక్షాత్తూ ప్రధానమంత్రే ఆరోపించారు.  ఇక జగన్ ఊరుకుంటారా?  ఇవాళ కాకపొతే రేపైనా యమపాశం విసరకుండా ఊరుకోడు. రాధాకృష్ణకు కూడా ఆ విషయం తెలియకపోదు.  అందుకే అర్జెంట్ గా మోడీకి, చంద్రబాబుకు సయోధ్య కుదిర్చాలి.  మోడీ కాళ్ళు పట్టుకుని అయినా చంద్రబాబును రక్షించాలి.  ఇప్పుడు ఎల్లో మీడియా ఏడుపు అమరావతి రక్షణ కాదు.  జగన్ నుంచి చంద్రబాబుకు రక్షణ.  అందుకే మోడీ తుమ్మినా, దగ్గినా కూడా ఆహా ఓహో అంటూ భజనలు ప్రారంభించారు.  అయితే ఆ మంత్రాలు ఏమాత్రం ఫలిస్తున్న సూచనలు లేవు. 
 
ఇంతలోనే రాధాకృష్ణకు మరో పిడుగుపాటు.  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఒరిజినల్ నాయకుడు సోము వీర్రాజుని నియమించబడటం, “మేత ఇక్కడ…కూత అక్కడ” అని పెద్దలు చెప్పినట్లు … బీజేపీ అధినేతగా ఉంటూ  చంద్రబాబు భజన చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణను గెంటివేయ్యడం, బీజేపీ ముసుగులు వేసుకుని చంద్రబాబుకు తాళం వేస్తున్న సుజనాచౌదరి, సీఎం రమేష్, లంకా దినకర్ లాంటి కోవర్టుల నోళ్లకు తాళాలు వేసెయ్యడం లాంటి చర్యలు రాధాకృష్ణ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.  తెలంగాణాలో అరివీరభయంకర శత్రువు, ఆంధ్రాలో ఆగర్భశత్రువు, కేంద్రంలో కళ్లెర్రజేస్తున్న శత్రువులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు రాష్ట్రంలో సోము వీర్రాజు రూపంలో మరొక భీకర  శత్రువు పుట్టుకుని రావడంతో రాధాకృష్ణ నరాలు చచ్చుబడిపోయి తన చెత్త రాతల్లో బీజేపీ నాయకుడు జీవీఎల్ ను అదుపు చెయ్యాలని వదరడం, అందుకు సోము వీర్రాజు రాధాకృష్ణకు తీవ్రమైన భాషలో హెచ్చరికలు చెయ్యడం ఒక్కరోజులో జరిగిపోయాయి.  ఒరిజినల్ బీజేపీ నాయకుడు జీవీఎల్ ను ఎలా ఉపయోగించుకోవాలో వారి నాయకత్వానికి బాగా తెలుసు.  వారికి సలహా ఇచ్చే సాహసానికి రాధాకృష్ణ తెగించాడంటే ఆయనకు మతిస్థిమితం ఉన్నదా లేదా అనే సందేహం కలుగుతోంది.  ఏమైనప్పటికీ సోము వీర్రాజు రాధాకృష్ణకు ఇచ్చిన ఘాటైన కౌంటర్ సంచలనం సృష్టించింది.  ఇన్నాళ్లకు బీజేపీలో ఒక మగాడు కనిపించాడని వారి పార్టీయే కాక మిగిలిన పార్టీలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.   ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా తీసుకురావడంలో సోము వీర్రాజు కృషి చేస్తే   తెలుగుదేశం స్థానాన్ని కచ్చితంగా బీజేపీ ఆక్రమిస్తుంది.  
 
చూడబోతే రాధాకృష్ణకు, ఎల్లో మీడియాకు భవిష్యత్తులో అష్టకష్టాలు తప్పేట్లు లేవు!  చూద్దాం ఏమవుతుందో!!
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు