Mudragada’s Strong Letter : కుక్క కాటుకి చెప్పుదెబ్బ: ముద్రగడ లేఖాస్త్రం తీరు ఇదీ.!

Mudragada’s Strong Letter : తెలుగు దేశం పార్టీని భుజాన మోసే టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆ సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణకు లేఖాస్త్రం సంధించారు ముద్రగడ.

కాపు ఉద్యమం పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసే కొందరు, ఆ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదిగేలా చేశారా.? అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీడీపీ నేత ఒకర్ని ఏబీఎన్ ఆర్కే ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ ముద్రగడ లేఖ రాశారు. అయితే, ఆయన తన లేఖలో చాలా అంశాల్ని ప్రస్తావించారు. అవన్నీ ఏబీఎన్ ఆర్కే కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎలా అడ్డగోలుగా ఎదిగారో పేర్కొన్న అంశాలే కావడం గమనార్హం.

‘కిరోసిన్ కిట్టూ’ అన్న విమర్శ ఏబీఎన్ ఆర్కే మీద వుంది. సైకిల్ మీద ఒకప్పుడు తిరిగిన ఆర్కే, ఇప్పుడెలా కోట్లకు అధిపతి అయ్యారన్నది ముద్రగడ ప్రశ్న. సరే, ఒకప్పుడు కింది స్థాయిలో వున్నవారు ఆ తర్వాత ఎదగకూడదన్న రూల్ ఏమీ లేదు కదా.? కానీ, రాజకీయాల్లో బెట్టింగులు, శరీరాలు కలిసి జన్మించిన కవలలకు ఆర్థిక సాయం పేరుతో జనాన్ని దోచెయ్యడం వంటి పనులు చేస్తే ఎలాగన్నది ముద్రగడ ప్రశ్న.

ముద్రగడ లేఖలో చాలా ఆరోపణలున్నాయి. వీటిపై ఏబీఎన్ ఆర్కే సమాధానమివ్వకపోతే, అవన్నీ నిజమేనని జనంలోకి సంకేతాలు వెళతాయి. పనిచేస్తున్న సంస్థ యజమాని కాళ్ళు పట్టుకుని కిందికి లాగేసి, ఆ కుర్చీలో ఆర్కే కూర్చున్నారన్నది ముద్రగడ చేసిన మరో తీవ్ర ఆరోపణ.

వీటన్నిటికీ ఆర్కే సమాధానమివ్వగలరా.? ఇచ్చి తీరాల్సిందే. సమాధానమిచ్చే ఉద్దేశ్యం లేకపోతే కనీసం పరువు నష్టం దావా అయినా వెయ్యాలి. వేస్తారా.? వెయ్యకపోతే ముద్రగడ ఆరోపణల్ని ఏబీఎన్ ఆర్కే అంగీకరించినట్లే అవుతుందేమో.!