Aam Aadmi Party : తెలుగు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితేంటి.?

Aam Aadmi Pary : ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, భవిష్యత్తులో దేశమంతా సత్తా చాటుతామంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి సానుభూతిపరులు ఎక్కువే వున్నారన్నది ఆ పార్టీ చెబుతున్నమాట. అడపా దడపా ఆమ్ ఆద్మీ పార్టీ జెండాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటాయి. ఆ పార్టీ ట్రేడ్ మార్క్ అయిన టోపీలు పెట్టుకుని, చీపురు పట్టుకుని కొందరు సందడి చేస్తుంటారు.

అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన నాయకత్వం లేదు. అదే అతి పెద్ద సమస్య. నాయకత్వం అనేది వుంటే, ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కొందరైనా ఆకర్షితులవుతారు. పంజాబ్ విషయంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి తొలుత నాయకత్వ సమస్య వుండేది. కానీ, కార్యకర్తల్లోంచే నాయకులు పుట్టుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరగబోతోందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వాదన. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్వీకరిస్తారనే ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు.

లోక్ సత్తా – ఆమ్ ఆద్మీ కలిసి పనిచేస్తాయంటూ కూడా ప్రచారం జరిగింది. అదీ కేవలం పుకార్లకే పరమితమైపోయింది. కానీ, ఢిల్లీ నుంచి పంజాబ్ వైపుగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించడంతో, తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి సానుభూతిపరులు పెరుగుతున్నారు.

సరైన నాయకత్వమంటూ వుంటే, ప్రధాన రాజకీయ పార్టీల విజయావకాశాల్ని దెబ్బతీసేలా, అది ఇంకెవరికో లాభం చేకూర్చేలా ఆమ్ ఆద్మీ ఎదుగుతుందన్నది నిర్వివాదాంశం.