Corona: గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ప్రపంచ దేశాలను తీవ్ర స్థాయిలో భయపెడుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి మరణించగా మరికొందరు బ్రతికి బట్ట కడుతున్నారు. అయితే కరోనా వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరూ చనిపోతారని ఏమీ లేదు. సరైన చికిత్స తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడవచ్చు. ఈ కరోనా వ్యాధి సోకిన తర్వాత ఎలాంటి భయబ్రాంతులకు గురి కాకుండా ఎంత ధైర్యంగా ఉండటమే సరైన నివారణ అంటూ ఎంతో మంది ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఇలా ఈ మహమ్మారి గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ వేసినప్పటికీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కరోనా వైరస్ వల్ల తీవ్ర ఆందోళన చెందుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే కరోనా సోకుతుందేమోనని భయపడి కొందరు మరణించగా మరికొందరు కరోనా సోకిందని తెలియడంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25 వ వార్డుకు చెందిన విజయ్ ఆచారి అనే యువకుడు కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తంఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అక్కడి వైద్యులు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విజయ్ ఆచారి ఆసుపత్రి నాల్గవ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.