ప్రపంచంలో ప్రతి రోజు ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా భర్తకి ఉద్యోగం లేకపోతే భార్యలు వారి నుండి విడిపోయిన సంఘటనలు మనం చూసే ఉంటాం. కానీ తనకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఒక భార్య తన భర్తను వదిలేసి వెళ్లిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… బీహార్ లోని మాధేపురా జిల్లా కేదార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మిథున్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో అతనికి హర్ ప్రీతి అనే యువతీతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ కొంతమంది సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత చాలా కాలం వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. భర్త సహకారంతో హర్ ప్రీతి కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి మిథున్ తన భార్యకి కోచింగ్ ఇప్పించాడు. ఇలా కొంతకాలం తర్వాత హర్ ప్రీతి కి కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. హర్ ప్రీతి సమస్తిపూర్ జిల్లా పటౌరీ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించి, విధులు నిర్వహిస్తోంది.
అయితే హర్ ప్రీతికి ఉద్యోగం వచ్చిన తర్వత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటివరకు భర్తతో సంతోషంగా జీవిస్తున్న హర్ ప్రీతికి విచిత్ర ఆలోచన కలిగింది. ఇక తనకి పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చిందన్న ధైర్యంతో తన భర్తను కాదని అతనిని విడిచి పెట్టి వెళ్లిపోయింది.
అయితే ఇంతకాలం తనతో సంతోషంగా ఉన్న తన భార్య ఇలా వదిలేసి పోవటంతో మిథున్ తట్టుకోలేకపోయాడు. హర్ ప్రీతి తనతోనే ఉండాలని కోరాడు. కానీ ఆమె మాత్రం అతనితో ఉండేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ మిథున్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. మిథున్ చేసిన ఫిర్యాదు అంగీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భార్య కోచింగ్ కోసం దాదాపు 10 నుండి 15 లక్షలు ఖర్చు చేసినట్లు మిథున్ ఆవేదన చెందాడు. అయితే హర్ ప్రీతి మాత్రం మిథున్ తన నుండి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని అవి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వింత ఘటన బీహార్ లో చర్చాంశనీయంగా మారింది.