ఈ సర్వే ఫలితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ హెచ్చరిక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన ర్యాంకునీ, అలాగే పాపులారిటీనీ దారుణంగా కోల్పోయారట. ఇండియా టుడే – మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. మరీ 16వ ర్యాంకుకి ఆయన పాపులారిటీ పడిపోవడమేంటి.? కేవలం 6 శాతమే ఆయనకు అనుకూలంగా మాట్లాడటమేంటి.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పైకి కనిపిస్తున్న వ్యవహారం వేరు, తెరవెనుకాల జరుగుతున్నది వేరు. సంక్షేమ పథకాలతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది పైకి కనిపిస్తున్న అంశం. కానీ, తెరవెనుకాల కథ చాలా దారుణంగా వుంది. సంక్షేమ పథకాలంటే ఎప్పటికప్పుడు పబ్లిసిటీ, ఆ వెంటనే.. వాటి కథ ముగిసిపోతుంది. పెన్షన్లు కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. ఏదైనా అంతే. ఓ వ్యక్తి పెన్షన్ లేదా మరో సంక్షేమ పథకం తాలూకు ఫలాన్ని అందుకుని, ఇంటికెళ్ళే లోపు.. అధ్వాన్నమైన రోడ్ల మీద గాయపడితే.. ఖేల్ ఖతం. ఓ కుటుంబంలో చదువుకున్న యువకుడు లేదా యువతికి ఉద్యోగం రాకపోతే, సంక్షేమ పథకాల ద్వారా అప్పటిదాకా వచ్చిన పబ్లిసిటీ మటాష్.

ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుంటుందా.? వుండదు. మరి, అభివృద్ధి పరంగా కీలకమైన ముందడుగు రెండేళ్ళయినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వేయలేకపోతున్నట్టు.? నిజానికి, సర్వేల్లో కనిపించేవన్నీ నిజాలు కావు. అయితే, గతంలో మంచి ర్యాంకు వచ్చినప్పుడు ఉప్పొంగిపోయారు గనుక, ఇప్పుడు వచ్చిన ఫలితాన్ని అధికార వైసీపీ అంగీకరించి తీరాల్సిందే. దీన్ని చూసి భయపడటం కంటే, ఈ ఫలితం ఎందుకు వచ్చిందన్న విశ్లేషణ అవసరం. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది గనుక, విపక్షాలేవీ ఈలోగా బలపడే అవకాశం లేదు గనుక.. అధికార పార్టీ తన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాలనా వైఫల్యాలపై ఫోకస్ పెట్టి, మెరుగైన పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలి. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి ద్వారా సంక్షేమం అమలు చేయొచ్చుగానీ, సంక్షేమం ద్వారా అభివృద్ధి సాధించడం అసాధ్యం.