Newly Wed: పెళ్లయిన 4 నెలలకే ఓ యువకుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు.ఏసీ మెకానిక్ గా పనులు చేస్తూ ఉన్నంతలోనే తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఎంతో సంతోషంగా చూసుకుంటూ సాగిపోతున్న జీవితంలోకి పెనుతుఫాను లాగా ఓ విషాదం చోటు చేసుకుంది.తాగి రోడ్డుపై హంగామా చేస్తున్న వారికి ఇది పద్ధతి కాదు అంటూ చెప్పిన పాపానికి అతను బలైన ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
పుదుచ్చేరిలోని విలియనూరులో ఉంటూ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న సతీష్ అలియాస్ మణికందన్ కి గత నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కొత్తగా వివాహమైన ఈ జంట ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరీ జీవితంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.వీరి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శంకర్, రమణి అనే దంపతులు వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ దంపతులు రోడ్డుపై కేక్ కట్ చేసి నానా హంగామా చేశారు. వీరితో పాటు వీరు సమీప బంధువులు కూడా ఈ వేడుకలో పాల్గొని తాగి హంగామా చేయడంతో ఇరుగుపొరుగు వారికి ఎంతో ఇబ్బంది కరంగా ఉంది.దీంతో సతీష్ వెళ్లి ఇది పద్ధతిగా లేదు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంట్లోకి వెళ్లి పార్టీ చేసుకోండి అని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఇలా వీరిద్దరూ గొడవ పడటంతో పెద్దలు కలుగజేసుకుని సర్ది చెప్పి పంపించారు. ఈ గొడవ ముగిసిన అనంతరం సతీష్ కి ఫోన్ రావడంతో ఇంటి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుండగా తాగిన మత్తులో ఉన్న రమణి తమ్ముడు రాజా అతని స్నేహితులు సతీష్ పై దాడిచేసి అతనిని కత్తితో పొడిచారు. దీంతో సతీష్ గట్టిగా కేకలు వేయడంతో బయటకు వచ్చిన కుటుంబ సభ్యులు సతీష్ రక్తపుమడుగులో ఉండడం చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అధిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది.