చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం… ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కొడుకు…!

దేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది వారి తప్పు లేకపోయినా ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడిపేవారు అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా..తండ్రీ , కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు టైరు పేలిపోవటంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకట్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా వెంకట్ భార్య పిల్లలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న వెంకట్ ఆదివారం తమిళనాడులోని వేలూరులో స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో వారు కారులో బయలుదేరి
గంగవరం మండలం, మామడుగు జాతీయ రహదారికి చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న కారు ఎడమ వైపు ఉన్న ముందు టైరు పేలిపోయింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ముందు సీట్ లో కూర్చున్న వెంకట్ భార్య , అతని మూడేళ్ల కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక వెంకట్ అతని కూతురూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కారులో చిక్కున్న వెంకట్ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.