75 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలంటూ పెద్దయెత్తున ప్రచారం చేసుకుంటున్నాం. నిజమే, స్వాతంత్ర్య దినోత్సవమంటే సగటు భారతీయుడి ఛాతీ.. ఇంకో నాలుగైదు అంగుళాలు ఎక్కువే ఉప్పొంగుతుంది. సగటు భారతీయుడి దేశభక్తిని కొలతల్లో చెప్పలేం. ఏ వ్యక్తి దేశ భక్తినీ సాటి భారతీయుడెవడూ ప్రశ్నించలేడు. అది వేరే సంగతి. ఇంతకీ, డెబ్భయ్ ఐదేళ్ళ స్వాతంత్ర్య భారతంలో ఏం సాధించాం.? ఏమీ సాధించలేదని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం.. సైనిక పాఠవంలో మేటి అనిపించుకున్నాం.. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధించాం. కానీ, పేదరికం విషయంలోనే ఇంకా ఇంకా పాత పాటే పాడుతున్నాం. జనాభా పెరుగుతోంది.. దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయిన మాట వాస్తవం. అయినాగానీ, అత్యంత పేదరికం ఇంకా దేశంలో అలాగే వుంది.
పేదరికాన్ని పారద్రోలడానికి సంక్షేమ పథకాలు ఎన్నో ఏళ్ళుగా అమలవుతున్నాయి. నిజానికి, ఇప్పుడు ప్రజల్ని సోమరుల్ని చేసేలా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అభివృద్ధి చెందుతున్న దేశం.. అని మనదేశం గురించి చాలా తరాలుగా చెప్పుకుంటున్నాం, చెప్పుకుంటూనే వున్నాం. ప్రపంచ దేశాలకు చాలా విషయాల్లో భారతదేశం మార్గదర్శిగా వ్యవహరిస్తోన్న మాట వాస్తవం. అదే క్రమంలో ప్రపంచం దృష్టిలో పలచనైపోతున్న సంఘటనలూ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి దేశంలో. దేశానికి పట్టిన ఒకే ఒక్క జాడ్యం ఏంటంటే.. దిక్కుమాలిన రాజకీయం. రాజకీయ వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో.. దేశంలో అన్ని రంగాలపైనా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నది ప్రజాస్వామ్యవాదుల ఆవేదన. ప్రశ్నించుకోవాల్సిందే.. సమీక్షించుకోవాల్సిందే. ఇంకెన్నాళ్ళు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వుంటాం.? అభివృద్ధి చెందిన దేశమని ఎప్పుడు చెప్పుకోగలుగుతాం.? ఈ ప్రశ్నకు సమాధానమెప్పుడు దొరుకుతుందో ఏమో.!