YS Jagan :2018 నాటికి పూర్తవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు, 2021లో కూడా పూర్తవకపోవడమేంటి.? ప్రత్యేక హోదా ఎజెండాగా రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినా, ఇప్పటికీ ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటితమైనప్పటికీ, ఆ ఫలాలు ఎందుకు అందట్లేదు.? ఏడున్నరేళ్ళ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదెందుకు.?
ఈ మూడు ప్రశ్నల చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ కాదు, పెద్ద రచ్చే జరుగుతోంది. చంద్రబాబు, బీజేపీకి అమ్ముడు పోవడం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావట్లేదని గతంలోనే వైసీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న వైసీపీ ఇప్పటికీ తీసుకురాలేకపోయింది.
రాజధాని అమరావతి పరిస్థితి మరీ దారుణం. రెండున్నరేళ్ళపాటు అమరావతిని రాజధానిగా వైసీపీ గుర్తించలేదు, ఇప్పుడు కూడా గుర్తించడంలేదు. మరి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? రానున్న రెండేళ్ళలో అయినా వైసీపీ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చేలా కనిపించడంలేదు.
రైల్వే జోన్ విషయానికొస్తే, ఇది మరీ దారుణం. చంద్రబాబు హయాంలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటితమయ్యింది. కానీ, అదిప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు అందలేదు. అందడమంటే.. ప్రత్యేక రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేదని అర్థం. దానికి బాధ్యత కేంద్రమే వహించాలి.. అదే సమయంలో, రాష్ట్రంలో అధికార పార్టీ కూడా బాధ్యత తీసుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే, ఇది రాష్ట్రానికి జీవ నాడి కావాల్సి వుంది. ఏళ్ళ తరబడి సాగుతూ సాగుతూ వుంది. జగన్ సర్కారు కూడా, చంద్రబాబు ప్రభుత్వంలానే పోలవరం ప్రాజెక్టుని నాన్చడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇవి కాక చాలా సమస్యలున్నాయి.. వాటిల్లో దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ప్లాంటు అతి ముఖ్యమైనవి. మిగతా విషయాల సంగతి సరే సరి. దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా అనూహ్యమైన మార్పులు రావొచ్చు. జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తే, రాష్ట్ర ప్రజలకు పైన చెప్పుకున్న నాలుగు అంశాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవడానికే ఆస్కారముండదు.