మూడో వేవ్ ముప్పు.. రెండో వేవ్ కంటే ఎక్కువగా.?

3rd Wave Of Covid 19, A Big Worrying Factor
3rd Wave Of Covid 19, A Big Worrying Factor
దేశంలో కరోనా మూడో వేవ్ తప్పదని తేలిపోయింది. పలు అధ్యయనాలు ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నాయి. అయితే, అదెప్పుడు మొదలవుతుందన్నదానిపై స్పష్టత లేదు. మహారాష్ట్రలో ఇప్పటికే మూడో వేవ్ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. మూడో వేవ్ పిల్లల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చునన్నది కొందరు నిపుణుల వాదన. అదంతా ఉత్తదేనని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఏది నిజం.? అన్నదానిపై మళ్ళీ గందరగోళం మామూలే.
 
ఇదిలా వుంటే, ఇప్పటినుంచే కరోనా మూడో వేవ్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, అవసరమైన ఆక్సిజన్ సిలెండర్లు అందుబాటులో వుంచుకోవాలనీ, మందులు తదితర విషయాల్లో ప్రభుత్వాలు చొరవ చూపాలనే హెచ్చరికలు వైద్య నిపుణుల నుంచీ, లాన్సెట్ వంటి వాటి నుంచీ జారీ అవుతున్నాయి.
 
కోవిడ్ రెండో వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్, కర్ఫ్యూల నుంచి వెసులుబాట్లు షురూ అయ్యాయి. దాంతో, జనం రోడ్ల మీదకు రావడం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో చాపకింద నీరులా కరోనా వైరస్ ఇంకోసారి వేగంగా విస్తరించే అవకాశాల్లేకపోలేదు. అయితే, ఇంత ప్రమాదం పొంచి వున్నా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మాత్రం జోరుగా సాగడంలేదు.
 
జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలందరికీ వ్యాక్సిన్ కేంద్రమే ఉచితంగా అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆ సమయానికి అవసరమైనన్ని డోసుల వ్యాక్సిన్ రాష్ట్రాలకు అందుతుందా.? లేదా.? అన్నదానిపైనా పలు అనుమానాలున్నాయి. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా ఎక్కువ ప్రభావం చూపింది.. నాలుగు రెట్లు ప్రభావం కనిపించింది. మరి, మూడో వేవ్ ఎలా వుండబోతోంది.? ఇంకో నాలుగు రెట్లు.. ఆ పైన అంటే, దేశం తట్టుకునే పరిస్థితి లేదు.