YCP In Dilemma : మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది వైఎస్ జగన్ సర్కారు. ‘మేం మూడు రాజధానులకు కట్టుబడి వున్నాం..’ అంటోంది వైసీపీ ప్రభుత్వం. మంత్రులు ఇప్పటికే ఈ విషయమై స్పష్టతనిచ్చేస్తున్నారు. కానీ, మూడు రాజధానుల అంశాన్ని కొలిక్కి తెచ్చేదెలా.? వివాదాల నుంచి గట్టెక్కేదెలా.?
మాట చెప్పడానికీ, పని చేయడానికీ చాలా తేడా వుంటుంది. అమరావతి విషయంలో అంతా గందరగోళమే. ఇప్పుడిప్పుడే స్పష్టత వచ్చేస్తూ వుంది. ఈ పరిస్థితుల్లో అమరావతిని కాదని, మూడు రాజధానుల వైపు వైసీపీ ఇంకా అదే పట్టుదలతో ముందుకు వెళ్ళాలనుకుంటే బొక్క బోర్లా పడటం తప్ప, మరోటి జరగదు.
ఇప్పటికే అధికారంలోకి వచ్చి మూడేళ్ళయిపోయింది. మూడేళ్ళలో చెయ్యలేనిది, రెండేళ్ళలో చేసేస్తామని, చేసెయ్యగలమని వైసీపీ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మిగిలిన రెండేళ్ళలో వైసీపీ ముందున్నది గట్టిగా ఏడాది కాలం మాత్రమ. ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం వచ్చేస్తుంది.
మూడు రాజధానుల విషయంలో వైసీపీ, తెలివిగా విపక్షాల్ని ఇరకాటంలో పెట్టాలనుకుందిగానీ, తానే ఇరకాటంలో పడే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకుని వుండకపోవచ్చు.
కారణాలేవైనాగానీయండి.. వైసీపీ ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికైనా నిబద్ధత చూపించగలిగితే, మూడు రాజధానులపై వైసీపీ చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతుంది.. 2024 ఎన్నికల్లో వైసీపీకి అది మేలు చేస్తుంది. లేదూ.. ఇంకా ఆ మూడు రాజధానుల్నే పట్టుకుని వేలాడతామంటే ఇబ్బందులు తప్పవు.