25 Years Chief Minister : ‘పాతికేళ్ళపాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతారు..’ అంటూ వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే వున్నామా.? అన్న అనుమానం, ఇలాంటి ప్రకటనలు రాజకీయ నాయకుల నుంచి విన్నప్పుడే కలుగుతుంటుంది. ఇదేమీ రాచరికం కాదు.. ఒకే పార్టీ, లేదా ఒకే వ్యక్తి అధికారంలో వుండడానికి.
ఐదేళ్ళకాలానికి మాత్రమే ప్రజలు ఓటేసి గెలిపిస్తారు ఏ రాజకీయ పార్టీకి అయినా. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రజలే ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి వుంటుంది. ముందరి ప్రభుత్వం అత్యద్భుతమైన పనులు చేసేసినా, మార్పు కోరుకునే అవకాశం ప్రజల చేతుల్లోనే వుంటుంది. అయితే, డబ్బు వెదజల్లి అధికారంలోకి రావడం అనేది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిన దరిమిలా, ఎవరు గెలిచినా, ఆ గెలుపుకి పెద్దగా విలువ లేకుండా పోయింది.
మళ్ళీ తామే అధికారంలోకి రావాలని ఏదన్నా రాజకీయ పార్టీ కోరుకుంటే అది తప్పు కాదు. కానీ, పాతికేళ్ళ కాలం పాటు తమదే అధికారమని ఎవరైనా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏం జరిగిందో చూశాం. కిరాయికి ఓటర్లను తీసుకొచ్చి మరీ ఓట్లేయించారు.
ఇదీ మన ప్రజాస్వామ్యం. బహుశా, 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ఆలోచనే అధికారంలో వున్న పార్టీ చేస్తే, అప్పుడు కూడా అదే పార్టీ అధికారంలోకి రావొచ్చు. కానీ, ప్రజల్లో వ్యతిరేకత దారుణంగా పెరిగిపోయింది. ప్రజా ప్రతినిథులు నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుంటోన్న దుస్థితి.