Discount On Petrol : పేదరికంలో మగ్గుతున్నవారికోసం జార్ఖండ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్రోలు ధరల్లో వారికి 25 రూపాయల మేర డిస్కౌంట్ ఇవ్వనుంది. 2022 జనవరి 26 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. ద్విచక్ర వాహనదారులకు మాత్రమే పెట్రోలు ధరల్లో తగ్గింపుని వర్తింపజేయనున్నారట. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
నిజానికి, ఇదో విచిత్రమైన తగ్గింపు. అసలు పేదలంటే ఎవరు.? పేదరికంలో మగ్గుతున్నవారికి పెట్రోలుతో నడిచే వాహనాలు వుంటాయా.. అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఈ రోజుల్లో పేదరికం.. అన్న మాటకి సరైన నిర్వచనమే దొరకదు.
పేదల ముసుగులో సంక్షేమ పథకాల కోసం ఎంతోమంది ఎగబడుతున్నారు. అందుకే దేశంలో సంక్షేమ పథకాల మీద ఆధారపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దశాబ్దాలుగా సంక్షేమ పథకాలు అమలవుతున్నా, లబ్దిదారుల సంఖ్య పెరుగుతూనే వుంది.. సంక్షేమ పథకాలూ పెరుగుతూనే వున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరల విషయానికొస్తే.. నిజమే పెట్రో ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి పెట్రోలు, డీజిల్ ధరలు భారంగా మారుతున్నాయి. ప్రధానంగా మద్యతరగతి ప్రజానీకం ఈ పెట్రో ధరల కారణంగా ఎక్కువగా నష్టపోతోంది. కానీ, వారికి ఏ ప్రభుత్వమూ ఊరటనివ్వడంలేదు సరికదా, నిలువు దోపిడీ చేసేస్తున్నారు పాలకులు.
ప్రజా రవాణా.. అంటే, ఆర్టీసీ బస్సులు అలాగే రైళ్ళకు సంబంధించి పెట్రో ధరల్లో తగ్గింపు అమలు చేస్తే, అది మొత్తం వ్యవస్థకే మేలు చేస్తుంది. అన్నిటికీ మించి, పెట్రో ఉత్పత్తుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు తగ్గిస్తే.. దేశం బాగుపడుతుంది. కానీ, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలంటే, పాలకులు పెట్రో దోపిడీ చేయక తప్పడంలేదు.