ఏపీలో 25 జిల్లాలు షురూ..జ‌గ‌న్ ప్లాన్ అదేనా?

పాల‌న సుల‌భ‌త‌రం కావాలి. స‌క్షేమ ఫ‌లాలు ప్ర‌తీఒక్క‌రికీ అంద‌ల‌న్న‌దే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరిక‌. అందుకే గ్రామ స్థాయిలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌ను..స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసారు. అందుకు త‌గ్గ సిబ్బందిని నియ‌మించారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న‌, పాల‌కులు అన్న నినాదంతో జ‌గ‌న్ స‌ర్కార్ ముందుకు క‌దులుతోంది. ఏడాది కాలంలో అది నిరూపిత‌మైంది. అధికారుల చుట్టు ప‌డిగాపులు ప‌డ‌కుండా…ఏ ప‌నైనా ద‌ర‌ఖాస్తు చేసుకున్న కొన్ని గంట‌ల్లోనే పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌జ‌ల వద్ద‌కు వెళ్లే నాయ‌కులు కావాలి గానీ..నాయ‌కులు చుట్టు ప్ర‌జ‌లు తిరిగే ప్ర‌భుత్వం నిర్మించ‌బోమ‌ని చెప్పింది చెప్పిన‌ట్లుగా చేస్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ ముందే చెప్పిన‌ట్లుగా పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల ఉన్న స్థానాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం అవుతున్న‌ట్లు నిన్న‌టి ముఖ్య‌మంత్రి మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో జిల్లాల మాట జ‌గ‌న్ నోట వ‌చ్చింది. జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో ఈ విష‌యం గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో అధికారులు అలెర్ట్ అయ్యారు. జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేసిన‌ట్లు తాజాగా ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి లీకైంది. ఇక నుంచి ప్ర‌భుత్వంలో ఉన్న‌త స్థాయి అధికారులు, క‌లెక్ట‌ర్లు జిల్లాల ఏర్పాటుపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్ట‌నున్నార‌ని చెబుతున్నారు. అలాగే ప్ర‌తీ జిల్లాకు ఒక వైద్య క‌ళాశాల‌ను కూడా ఏర్పాటు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది.

ప్ర‌స్తుతం ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. పార్ల‌మెంట్ స్థానాన్ని బ‌ట్టి జిల్లాలు చేస్తే అద‌నంగా 12 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అంటే మొత్తం అప్పుడు ఏపీలో 25 జిల్లాలు ఏర్పాట‌వుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్టంగా ఆవిర్భించిన త‌ర్వాత‌….టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే 10 జిల్లాలు గా ఉన్న తెలంగాణ 33 జిల్లాలుగా ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. జిల్లాల ఏర్పాటు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడే పాల‌న సుల‌భం అవుతుందని, ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వివ‌రాలపై ప్ర‌భుత్వ అధికారుల‌కు ప‌క్కాగా ఓ క్లారిటీ ఉంటుంద‌ని కేసీఆర్ అప్ప‌ట్లో అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే దారిలో న‌డుస్తున్నారు.