2024 ఎన్నికలే చివరి ఛాన్స్.. పవన్, లోకేశ్ ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా?

ఏ రాష్ట్రానికి అయినా సీఎం కావాలని అనుకునే వ్యక్తి రాజకీయాల్లో అనుభవాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో సంచలనాలు సృష్టించి ఉండాలి. పవన్ కళ్యాణ్, లోకేశ్ ఏపీకి సీఎం కావాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు వీళ్లిద్దరూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఈ ఇద్దరూ రెండు ప్రముఖ పార్టీలకు చెందిన నేతలే అయినప్పటికీ ఇద్దరికీ ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.

అటు పవన్ ఇటు లోకేశ్ పూర్తిస్థాయిలో సమయాన్ని రాజకీయాలకు కేటాయించిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే. వీళ్లు ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారో ఎప్పుడు యాక్టివ్ గా ఉండరో ఆ పార్టీ నేతలు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే 2024 ఎన్నికల్లో కూడా అటు లోకేశ్ ఇటు పవన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లోకేశ్ మంగళగిరి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడినుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో షాకింగ్ ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పవన్ మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం లోకేశ్, పవన్ పరువు పోతుందని చెప్పవచ్చు.

లోకేశ్ గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎన్నికల ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయరని టాక్ ఉంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటినుంచి అన్ని పార్టీలు కృషి చేస్తుండగా ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. ప్రతి పార్టీ సొంతంగా సర్వేలు చేయించుకుంటూ ఎన్నికల్లో గెలుపు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.