2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ మరో రెండుసార్లు తామే అధికారంలో ఉంటామని బలంగా నమ్మారు. కానీ కరోనా వచ్చి వారి ఆశాల్లో నీళ్లు చల్లింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన జరిగిన అభివృద్ధి పని ఒక్కటి కూడా లేదు. అలాగే దాదాపు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే ఉంది. అలాగే మూడు రాజధానులంటూ ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకోవడం వల్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు అప్పుడే వ్యతిరేకత ఏర్పడింది. దింతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్నట్టు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు.
పార్టీల రాజకీయ భవిష్యత్ ను చెప్పనున్న 2021
కరోనా వల్ల 2020 ఇలా గడిచిపోయింది కానీ 2021 మాత్రం ఏపీ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద ఎంతో కొంత స్పష్టత 2021 ఇవ్వబోతోంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటా ఢంకా భజాయించే పార్టీలకు ఇక ముందు తిరుగు ఉండదన్న భరోసా అయితే వస్తుంది. మరి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు గాలివాటం అని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూ తమ్ముళ్ళను నమ్మిస్తున్న తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అనుకూలం అవుతుందా అన్నది చూడాలి. అలాగే బీజేపీతో కలిసిన జనసేన ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మూడు రాజధానుల అంశంపై స్పష్టత
మరొకొన్ని రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు వైసీపీ పాలనపై ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు తెలపనున్నారు. ఈ ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ విజయం సాధిస్తే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నట్టు. అలాగే ఈ ఎన్నికలు మూడు రాజధానుల అంశంపై స్పష్టత తీసుకురానున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ప్రజలు మూడు రాజధానుల అంశానికి మద్దతు ఇచ్చినట్టని, వైసీపీ ఓడితే ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతోషంగా లేరని డైరెక్ట్ గా చెప్పినట్టని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.