2014 నుంచి 2019 వరకు ప్రతి ఏడాదీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా పబ్లిసిటీ స్టంట్లు చేసేవారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవడం వల్ల ఆంధ్రపదేశ్ నష్టాల పాలయ్యిందంటూ జూన్ 2వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు జరిగేవి. వారం రోజులపాటు ఈ కార్యక్రమాల్ని చంద్రబాబు సర్కార్ నిర్వహించేది. ఈ క్రమంలో తాము సాధించిన ఘనతల గురించీ చెప్పుకునేవారు ఇంకా ఘనంగా చంద్రబాబు. ఏ ప్రభుత్వమైనా తమ హయాంలో చేసిన గొప్ప పనుల గురించి చెప్పుకోవడం సహజమే. వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రచారం చేసుకుంటూనే వుంది. అయితే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఓవరాక్షన్ ఒకింత జుగుప్సాకరమైన స్థాయికి చేరింది. పరుష పదజాలంతో వైసీపీ మీదా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు టీడీపీ మద్దతుదారులు. దాంతో, వైసీపీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ జరుగుతోంది.
ఓ వారం రోజుల ముందు నుంచే ఈ యుద్ధం సోషల్ మీడియాలో షురూ అయ్యింది. అది తారాస్థాయికి చేరింది. టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా, తనదైన స్టయిల్లో ట్వీట్లేసుకుంటూ వెళుతున్నారు. వాటిని చూసి టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతుండడం గమనార్హం. వైసీపీ శ్రేణులు తక్కువేమీ తినలేదు.. ప్రతిపక్షానికి దిమ్మ తిరిగేలా షాకులు ఇచ్చేసుకుంటూ వెళుతున్నారు వైసీపీ మద్దతుదారులు. వెరసి, సోషల్ మీడియా అంతా ఈ తిట్ల ప్రసహనంతోనే నిండిపోయింది. కరోనా భూతాన్ని సైతం రాష్ట్ర ప్రజలు మర్చిపోయేలా ఈ యుద్ధం జరుగుతోంది. దీనివల్ల ఎవరికి లాభం.? పోతున్నది రాష్ట్రం పరువే.