19 వ తేదీ శుక్రవారం 9 సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమాల్ని ఉత్పత్తి చేయడంలో టాలీవుడ్ సామర్ధ్యం తక్కువేమీ కాదు, ఈ సామర్ధ్యంతో ప్రేక్షకులే పోటీ పడాలి. పోటీ పడి చూడకపోతే ఓటమి వాళ్ళదే. పెద్ద సినిమాలైతేనే చూస్తాం, చిన్న సినిమాల్ని పట్టించుకోమంటే చిన్న సినిమాలేమైపోవాలి. చిన్న సినిమాల్ని కూడా ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడే చిన్న సినిమాల్ని ఇంకా ఇంకా బాగా తీస్తారు. కొత్త నిర్మాతలు, దర్శకులు, నటులూ, సాంకేతికులూ ఇంకెందరో వస్తారు. ప్రజలు ఎక్కువ తినేది శాఖాహారమే, సినిమాలు ఎక్కువ నిర్మించేది చిన్న సినిమాలే.
చిన్న సినిమాలు శాఖాహారం, పెద్ద సినిమాలు నాన్ వెజ్. ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం కాదు, ఇక్కడి చిన్న చిన్న తెలుగు సినిమాల్ని కూడా థియేటర్లలో చూసి మంచి చెడ్డలు కామెంట్లు పెడితే తెలుగు సినిమాల అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళవుతారు. తెలుగు సినిమాల్ని వదిలేసి ఎక్కడివో సినిమాల్ని పొగడడమేమిటి?
ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడంతో 9 చిన్న సినిమాలకి అవకాశం చిక్కింది. ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, స్ట్రీట్ లైట్, పోస్టర్, మిస్టర్ లోన్లీ, రామ్ అసుర్, రావణ లంక, ఛలో ప్రేమిద్దాం, సావిత్రి వైవ్ ఆఫ్ సత్యమూర్తి ఇవన్నీ విభిన్న జానర్లు. లవ్, సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ. నిర్మాతలు, దర్శకులు, హీరో హీరోయిన్లూ అందరూ కొత్త వాళ్ళు. ప్రేక్షకుల ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నారు.