దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నాయి. ఈక్రమంలో గత ఆదివారం.. జూన్ 20న వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అరుదైన రికార్డు సాధించింది. ఒక్కరోజులో ఏకంగా 13.75 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. అంతకుముందు తన పేరు మీదే ఉన్న 6లక్షల రికార్డును డబల్ మార్జిన్ దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈక్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 84 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. ఇదొక అరుదైన రికార్డని కేంద్రం ప్రకటించింది. అయితే.. ఏపీ జూన్ 21న దాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి సృష్టించిన రికార్డును ఒక్క రోజు తేడాలోనే మధ్యప్రదేశ్ అధిగమించి సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ లో జూన్ 21న.. సోమవారం ఏకంగా 16 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు. ఇండోర్ జిల్లాలో అత్యధికంగా 2.2 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. దీంతో మధ్యప్రదేశ్ రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.
సోమవారంతో వ్యాక్సినేషన్ మొదలై 157వ రోజుకు చేరుకుంది. ఈక్రమంలో వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘జూన్ 21 దేశవ్యాప్తంగా దాదాపు 85లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా.. ఏప్రిల్ 1న ఒక్కరోజులో 48 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించిన రికార్డును తిరగరాయడం సంతోషంగా ఉంది. కోవిడ్ కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధమైన వ్యాక్సిన్ ను వేయించుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ క్రమంలో కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు ధన్యవాదాలు. వెల్డన్ ఇండియా’ అని అన్నారు.