ఈనెల 15న ఏపీ ప్రభుత్వం మంత్రి వర్గసమావేశానికి సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీ పై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు రాష్ర్టంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ భేటిలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ, విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని తరలింపు, కొత్త జిల్లాల ఏర్పాటు, వలంటీర్ల వేతలనాల పెంపు తదితర కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. అలాగే త్వరలో ప్రవేశ పెట్టబోయే మరికొన్ని పథకాలకు సంబంధించి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉన్నట్లు సమాచారం.
కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలంటే ఆదాయ వనరుల సమీకరణ, అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి వర్గ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం అన్ని అంశాలలోకెల్లా ముఖ్యమైన అంశాలు ఏవి అంటే? రాజధాని తరలింపు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎక్కువ సేపు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన రాజధానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులంతా విశాఖలోనే బస చేసారు. రాజధానికి సంబంధించిన పనుల్లోనే తలమునకలై ఉన్నారు. డీజీపీ గౌమత్ సవాంగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇప్పటికే తరలింపు బాగా ఆలస్యమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా పరిపాలన యాంత్రాంగాన్ని విశాఖకు తరలించి పనులు మొదలు పెట్టాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.
అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం జోరుగానే రంగం సిద్దం చేస్తోంది. పార్లమెంట్ స్థానాలు ఆధారంగా 13 జిల్లాలున్న ఏపీని 25 జిల్లాలుగా మార్చాలని సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రాజకీయంగా దెబ్బ తినే అవకాశం ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించి కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.