Ex Minister Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ హైద్రాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఇటీవల పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన విషయం విదితమే. దాదాపు ప్రతి పేపర్ లీక్ అయినట్లుగా, పరీక్షలు జరిగనన్నాళ్ళూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొన్ని అరెస్టులూ జరిగాయి.
నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలే ఈ లీకేజీకి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోపక్క, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి నారాయణను ఈ కేసులో అరెస్టు చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం బయల్దేరింది.
వాస్తవానికి, మాజీ మంత్రి నారాయణపై అమరావతి కుంభకోణంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన నారాయణ, అమరావతి నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నారు. అప్పట్లో ఆయన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
నారాయణ విద్యా సంస్థల మాటున కూడా అమరావతిలో కుంభకోణాలు జరిగాయని, అప్పట్లో ప్రతిపక్షంలో వున్న వైసీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరావతి కుంభకోణంలోనే అరెస్టు కావాల్సిన నారాయణ, అనూహ్యంగా పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టు కావడం గమనార్హం.
అయితే, ఈ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర వుందని టీడీపీ ఆరోపించడం మామూలే. హైద్రాబాద్ నుంచి ఏపీకి తరలించిన సీబీఐ అధికారులు, ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే, అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగు చూస్తాయి.